Magazines

తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌‌కు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు

14 నిమిషాల క్రితం

Telangana Housing Corporation
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

అవినీతి రహిత పాలన దిశగా కీలక ముందడుగు : మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరుస్తూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నందుకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. ఈ సర్టిఫికేట్లను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా శుక్రవారం హైదరాబాద్‌‌లో కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ విపి గౌతం అందుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో వివిధ అంశాలపై అధ్యయనం చేసిన ఐఎస్‌‌ఓ ప్రతినిధుల బృందం ఈ మేరకు సర్టిఫికెట్లను అందజేసింది. పాలనాంశాల్లో నాణ్యతా ప్రమాణాల వ్యవస్థ పటిష్టంగా అమలు చేస్తున్నందుకు ISO 9001:2015 (నాణ్యతా నిర్వహణ వ్యవస్థ) సర్టిఫికెట్‌తో పాటు, అవినీతికి తావులేకుండా సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే చర్యలకు ISO 37001:2016 (అవినీతి నిరోధక నిర్వహణ వ్యవస్థ) సర్టిఫికెట్లు లభించాయి. ఐటీ సర్వీసుల్లో అత్యున్నతమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నందుకు ISO 27001 (సమాచార భద్రతా నిర్వహణ వ్యవస్థ) వినియోగదారుల సంతృప్తి, ఫిర్యాదుల పరిష్కార నిర్వహణ వ్యవస్థ నిర్వహణకు ISO 10002 సర్టిఫికెట్లను ఆ సంస్థ జారీ చేసింది.

తెలంగాణా హౌసింగ్ కార్పొరేషన్‌ అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేయడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకంలో సంస్థ మేనేజింగ్ డైరక్టర్ విపి గౌతం అనేక రకాల సంస్కరణలను తీసుకొచ్చారు. అధికారులందరూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేయడంతోపాటు, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే ప్రభుత్వపరమైన కార్యక్రమాలన్నీ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.10 లక్షల ఇండ్లు పూర్తి కాగా, ఎనిమిది వేల కోట్లకు పైగా మొత్తాన్ని లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలకు జమ చేయడం జరిగింది. లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా కాల్ సెంట‌ర్‌ను (నెంబర్‌ 1800 599 5991) కూడా ఏర్పాటు చేశారు. అవినీతిరహిత పాలన దిశగా ఈ సర్టిఫికెట్లు రావడం కీలక ముందడుగు అని మంత్రి పొంగులేటి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్