Magazines

భూగర్భ జలాల పరిరక్షణకు రాష్ట్రవ్యాప్త కార్యాచరణ

15 నిమిషాల క్రితం

Statewide action
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

యాసంగికి ముందే జల లభ్యతపై శాస్త్రీయ అంచనా
వాటర్‌షెడ్‌ల వారీగా నీటి లెక్కలు, పర్యవేక్షణకు ‘టాస్క్‌ఫోర్స్‌’ : మంత్రి ఎన్. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వెల్లడి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

ఎల్‌నినో నేపథ్యంలో రానున్న రోజుల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగనుందని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వెలికితీతను నియంత్రించడం, అందుబాటులో ఉన్న జలవనరులను సుస్థిరంగా వినియోగించుకోవడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తెలిపారు. యాసంగికి ముందే నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేసి, తక్కువ నీటితో సాగయ్యే పంటలపై రైతులకు మార్గనిర్దేశం చేయనున్నట్టు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌రాష్ట్ర సచివాలయంలో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులతో కలిసి భూగర్భ జలాల పరిస్థితి‌పై ఉత్తమ్‌ సమీక్షించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తామని, దాని ఆధారంగా అధికారులతో చర్చించి శాఖల సమన్వయంతో కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.

సీఎస్‌ఐఆర్‌–నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నిపుణులు, ఐఐటీ హైదరాబాద్‌ అనుబంధ ఆచార్యులు ప్రొఫెసర్‌ వీరేంద్ర తివారీ ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ భూగర్భ జలాల అంచనా కమిటీ (జీఈసీ) నమూనాను ఉపయోగించి వర్షపాత గణాంకాలను భూగర్భ జల నిల్వలతో పోల్చి తక్షణమే అంచనా వేయాలని సూచించారు. ప్రాథమిక అంచనాను కొద్ది రోజుల్లోనే పూర్తి చేయవచ్చని సూచించారు. తెలంగాణలో మొత్తం నీటి వినియోగంలో 94 శాతానికి పైగా సాగుకే వెళ్తోందన్నారు. గృహావసరాలు, ఇతర వినియోగాల వాటా సుమారు 1.8 శాతమని పేర్కొన్నారు. ప్రతి వాటర్‌షెడ్‌ (జల పరీవాహక ప్రాంతం) పరిధిలో భూగర్భ జలాల లభ్యత ఎంత, సాగుకు అవసరమైన నీరు ఎంత అనే వివరాలను పటాల రూపంలో పొందుపరచాలని ఆదేశించారు. ఆ వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాలకు అనువైన పంటలను రైతులకు సూచించాలని చెప్పారు.తగినంత నీటి నిల్వలున్న ప్రాంతాల్లో వరి సాగుకు అవకాశం ఉంటుందని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తివారీ సూచించారు. ఆయా పంటల సాగుతో ఎంత ఆదాయం పొందవచ్చో ప్రభుత్వం రైతులకు వివరించాలన్నారు. పరిమితమైన సభ్యులతో ‘టాస్క్‌ఫోర్స్‌’ను ఏర్పాటు చేసి, రాష్ట్ర నాయకత్వానికి నేరుగా నివేదించేలా చూడాలని ఆయన ప్రతిపాదించారు. వారానికోసారి, పది రోజులకోసారి లేదా రెండు వారాలకోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలను సమన్వయం చేయాలన్నారు.తక్కువ వర్షపాతం నమోదయ్యే ఇజ్రాయెల్‌ తదితర దేశాలు అందుబాటులో ఉన్న ప్రతి వానచుక్కను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకుంటున్న తీరును ప్రస్తావించారు. తెలంగాణలోనూ ఆ విధానాన్ని అనుసరించాలన్నారు. సమీక్షలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఈఎన్‌సీ (జనరల్‌) ఓ.వి. రమేష్‌బాబు, సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస్‌, భూగర్భ జలాల శాఖ డైరెక్టర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్