నల్ల మల్లారెడ్డి స్కూల్ నుంచి సర్టిఫికెట్లు అందజేత :
సమస్యను పరిష్కరించిన గద్వాల విజయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫీజులు చెల్లించినప్పటికీ విద్యా ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం ప్రజావాణిని ఆశ్రయించిన ఇద్దరు మైనర్ విద్యార్థినులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జీ గద్వాల విజయలక్ష్మి చొరవతో ఘట్‌కేసర్ మండలం నారపల్లిలోని నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ యాజమాన్యం నిలిపేసిన విద్యా సర్టిఫికెట్లను శుక్రవారం సీఎం ప్రజావాణి కార్యక్రమంలో ఆ బాలికలకు అందజేసింది.
గతంలో సీఎం ప్రజావాణికి ఇద్దరు బాలికలు ఉషాశ్రీ (పదో తరగతి), ఊర్షిత (ఏడో తరగతి) అకడమిక్ సర్టిఫికెట్లు పాఠశాల యాజమాన్యం ఇవ్వడం లేదనీ, చదువు కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారు. బాలికల ఆవేదనను స్వయంగా విన్న ఆమె వెంటనే స్పందించి, స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ సోమిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే విద్యార్థినులకు అవసరమైన సర్టిఫికెట్లు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాకు అధికారికంగా లేఖ రాసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.గద్వాల విజయలక్ష్మి చొరవతో విద్యాశాఖ ఆర్జేడీ సోమిరెడ్డి స్పందించి నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌కు వెళ్లి విద్యార్థినులకు సంబంధించిన బదిలీ సర్టిఫికెట్లు, బోనఫైడ్, కండక్ట్, మైగ్రేషన్ సర్టిఫికెట్లతోపాటు మార్కుల మెమోలను సేకరించి స్వయంగా సీఎం ప్రజావాణిలో గద్వాల విజయలక్ష్మికి అందజేశారు.
శుక్రవారం సీఎం ప్రజావాణి కార్యక్రమంలో ఆ విద్యార్థినులకు సర్టిఫికెట్లను అందించారు. దీంతో తమ విద్యా భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళన తొలగిపోవడంతో బాలికలు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే హక్కు ఏ విద్యాసంస్థకూ లేదని స్పష్టం చేశారు. ఫీజులు, ఇతర పరిపాలనా కారణాలతో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపేసి వారి చదువుకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు.






కామెంట్‌లు (0)