రూ. 220 కోట్లతో ఆటోనగర్ కాలనీ ఏర్పాటు : రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నగరంలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటోరిక్షా కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నది. గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ఆటోరిక్షా కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘ఆటో నగర్ కాలనీ’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆటో కార్మికుల కుటుంబాలకు శాశ్వత నివాస భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని బండ్లగూడ, గంధంగూడ, పేట్‌బషీరాబాద్, జల్పల్లి, లక్ష్మిగూడ ప్రాంతాల్లో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు తెలిపారు. ఒక్కో ప్రాంతంలో 500 ప్లాట్ల చొప్పున మొత్తం 2,000 ఆధునిక ప్లాట్లను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.220 కోట్ల అంచనా వ్యయం అవుతుందని వెల్లడించారు. ఈ పథకం ప్రత్యేకంగా ఆటోరిక్షా కార్మికుల కోసమే రూపొందించామని పేర్కొన్నారు.






కామెంట్లు (0)