Magazines

అండాల అక్రమ సేకరణపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలి

12 నిమిషాల క్రితం

illegal collection
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

ఏఆర్టీ చట్టంలో లోపాలను సవరించాలి

కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి : గవర్నర్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వినతి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

అండాల అక్రమ సేకరణ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలనీ, ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కోరింది. ఈ మేరకు బుధవారం కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, సభ్యురాలు ఉజ్మా షకీర్ లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన పేద, మధ్యతరగతి మహిళలను ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా అండాలు సేకరిస్తున్న వ్యవహారంపై తెలిపారు. ఈ వ్యవహారం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా వివిధ రాష్ట్రాలకు విస్తరించి ఉన్న నేపథ్యంలో, దీని వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని మహిళా కమిషన్ గవర్నర్ గారిని కోరింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ (ఏఆర్టీ చట్టం) అమలులో ఉన్న లోపాలు, చట్టంలోని ఖాళీలను గుర్తించి, మహిళల హక్కులు, ఆరోగ్యం, భద్రతకు మరింత రక్షణ కల్పించే విధంగా చట్టాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఇందుకోసం అవసరమైన సవరణలను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని వారు కోరారు. ఇప్పటివరకు కమిషన్ చేపట్టిన విచారణ, సంబంధిత అధికారుల నుంచి సేకరించిన సమాచారం, వెలుగులోకి వచ్చిన కీలక అంశాలను గవర్నర్ కు వారు తెలియజేశారు. ఈ వ్యవహారంపై పోలీసు శాఖ చేపడుతున్న దర్యాప్తు వివరాలతో పాటు, నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి కూడా వివరించారు. సంబంధిత శాఖల అధికారులతో త్వరలో చర్చించి, ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి, ఈ అంశంపై తగిన చర్యలు తీసుకునేలా సూచనలు చేస్తానని గవర్నర్ తెలిపినట్టు కమిషన్ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్