Magazines

వ్యవసాయరంగంపై తెలంగాణతో 
పనిచేసేందుకు జర్మనీ సంసిద్ధత

10 నిమిషాల క్రితం

Germany expresses
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

మంత్రి తుమ్మలతో జర్మనీ బృందం భేటీ

ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌‌కు 
రావాలని ఆహ్వానించిన తుమ్మల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వ్యవసాయ రంగంలో ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌, స్టోరీ, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం అందజేత, తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు జర్మనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. బుధవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌‌ బీఆర్‌ అంబేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జర్మనీ బృందం భేటీ అయ్యింది. ఇన్వెస్ట్‌ ‌తెలంగాణ గ్లోబల్‌ ‌సమ్మిట్‌‌లో పాల్గొనాలని జర్మనీ ప్రతినిధులకు మంత్రి తుమ్మల ఆహ్వానం పలికారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు పెట్టుబడులు, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడం, వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అధిగమించేందుకు సహకరిస్తామని జర్మనీ బృందం హామీనిచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార నిల్వ సదుపాయాలు (స్టోరేజీ), పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ రంగాల్లో సహకారం అందించేందుకు ఆసక్తి చూపింది. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయనీ, రానున్న రోజుల్లో జర్మనీకి చెందిన మరిన్ని వ్యాపార సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ నుంచి జర్మనీకి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని జర్మనీ ప్రతినిధులను కోరారు.భారత్–జర్మనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, న్యూఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయానికి చెందిన వ్యవసాయ, ఆహార విభాగం అధిపతి మిస్టర్ వోల్కర్ క్లిమా, బీఎంఎల్‌ఈహెచ్ ద్వైపాక్షిక సహకార కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ ఆండ్రియాస్ గ్రామ్‌జో, ప్రాజెక్టు మేనేజర్ సబ్రినా లాండ్‌మన్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్