Magazines

ఇంటర్ బోర్డు రద్దుతో తెలంగాణ విద్యార్థులకు నష్టం

4 రోజుల క్రితం

Abolition of the Intermediate Board spells loss for students in Telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 3 నిమిషాల చదవడం

ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : కల్వకుంట్ల కవిత

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఇంటర్ బోర్డును రద్దు చేసి పాటశాల విద్యలో విలీనం చేస్తే స్థానికత అంశంలో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో ఇంటర్ బోర్డు రద్దు - తెలంగాణ విద్యపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఎవరిని సంప్రదించకుండా, చర్చించకుండా తీసుకున్న ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా సంస్థలకు అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడే స్థానికులయ్యే ప్రమాదముందని తెలిపారు. ప్రయివేట్ బడ్జెట్ స్కూళ్ల యాజమా న్యాలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఈ అంశంపై విస్తృత ప్రజాభిప్రాయాన్ని సేకరించాలనీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించాలని ఆమె డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పక్షాన ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ రద్దుకు ప్రభుత్వం చెబుతున్న డ్రాపౌట్స్, దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్న విద్యా విధానం అమలు, కార్పొరేట్ల ఇంటర్ విద్య కబ్జా వంటి కారణాలు సహేతుకంగా లేవని కొట్టిపారేశారు. ఇంటర్ బోర్డు రద్దుతో కలిగే ప్రయోజనాలేంటో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవిడెన్స్ ఆధారిత పబ్లిక్ పాలసీ అవసరమని ఆయన సూచించారు. విద్యార్థులకు ఏది ప్రయోజనం అనే దానిపైన చర్చించాలని ఆయన కోరారు.

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేవలం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ నిర్ణయంతో చిన్న స్కూళ్లకు నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవో 97 రద్దు కోసం పోరాడిన తరహాలో ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మెన్ పాపిరెడ్డి మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల సమస్యను ప్రభుత్వ పరిపాలన అంశంగా చూస్తోందని తప్పుపట్టారు. రద్దు విషయంలో స్టేక్ హోల్డర్లు సిద్ధంగా లేరనీ, ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ పి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం దివంగత ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావుపై కోపంతోనే ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేస్తున్నారే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని కొట్టిపారేశారు. ఈ విషయంపై మరోసారి అందరితో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రాపౌట్స్ తగ్గించేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యా విధానం వంటి కారణాలన్ని ప్రభుత్వం చెబుతున్న పచ్చి అబద్ధాలని విమర్శించారు. సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, రద్దు విషయంలో తలెత్తుతున్న అనేక అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో సామాన్యులు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియేట్ కళాశాలల్లో పదవ తరగతి పెట్టుకోవచ్చని ఆ కళాశాల యాజమాన్యాలకు బోర్డ్ అధికారులు చెబుతున్నట్టు తెలిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం మంది విద్యార్థులు బడ్జెట్ స్కూళ్లలోనే చదువుతున్నారని,అయినప్పటికీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని, ఎవరితోనూ చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రస్మా అధ్యక్షుడు మదుసూదన్ మాట్లాడుతూ 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు కార్పొరేట్లకు అప్పగిస్తే పోటీ పరీక్షలు నిర్వహిస్తారని, విద్యార్థుల్లో స్కిల్ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్రంగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన పాలసీని రూపొందించాలని కోరారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకిస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఈ సమావేశంలో ట్రస్మా అధ్యక్షులు మధుసూదన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె వినయ్ కుమార్, పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, జార్జి రెడ్డి పీడీఎస్ యూ నాయకులు ఎస్.నాగేశ్వర్ తదితరులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్