బేగంపేట మెట్రో రైల్ భవన్‌లో విధుల్లో చేరిన ఐడీఈఎస్ అధికారి
ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా 69 కి.మీ. మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేస్తామని వెల్లడి
మెట్రో విస్తరణ ప్రణాళికల అమలుకు పటిష్ట చర్యలు చేపడతామని స్పష్టీకరణ
శుభాకాంక్షలు తెలిపిన హెచ్‌ఎంఆర్‌ఎల్ సీనియర్ అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా బి. అజిత్‌రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో ఆయన పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) ఎండీగా విధుల్లో చేరారు. ఇప్పటివరకు హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు ఎండీగా సేవలందిస్తున్న ఆయనను ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ట్రాఫిక్ నియంత్రణ, మెట్రో విస్తరణే లక్ష్యం
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు 69 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. ప్రయాణికులకు మెట్రో అందుబాటును(యాక్సెసిబిలిటీ) మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థను మరింత విస్తరించేందుకు రూపొందించిన ప్రణాళికలు విజయవంతంగా అమలయ్యేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పలు కీలక హోదాల్లో సేవలు
ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్(ఐడీఈఎస్)కు చెందిన అజిత్‌రెడ్డి ప్రస్తుతం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవోగా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. నూతన ఎండీగా బాధ్యతలు చేపట్టిన అజిత్‌రెడ్డిని హెచ్‌ఎంఆర్‌ఎల్ సీనియర్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.






కామెంట్‌లు (0)