ముగిసిన ఎస్సై పోస్టుల ప్రిలిమ్స్ పరీక్ష

53 నిమిషాల క్రితం

SI
avatar
balaji

ప్రచురించబడింది నవం 30, 2026 | 2 నిమిషాల చదవడం

మూడు నిమిషాల ఆలస్యంతో ఎగ్జామ్ కు ఓ అభ్యర్థిని దూరం

పరీక్ష రాసే తల్లికి కానిస్టేబుల్ సాయం


నవతెలంగాణ- చౌటకూర్ / నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధిం చి ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 335 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 90. 44 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో 275 ఎస్సై పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. మొత్తం లక్షా 60 వేల 712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో లక్షా 45 వేల 342 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా కరీంనగర్ రీజినల్ సెంటర్ పరిధిలో 92.69 శాతం హాజరు నమోదు కాగా, అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి రీజియన్‌లో 88.25 శాతం మంది హాజరయ్యారు.


మూడు నిమిషాల ఆలస్యం..

మూడు నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఓ అభ్యర్థిని ఎస్ఐ ప్రిలిమ్స్‌ ‌పరీక్షకు దూరమైంది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ ‌మండలంలో నిసుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూహెచ్ కళాశాలలో ఆదివారం ఎస్‌ఐ పోలీస్ నియామక రాత పరీక్ష నిర్వహించారు. అయితే పటాన్‌‌చెరుకు చెందిన శ్రీదేవి అనే అభ్యర్థిని నిర్ణీత సమయం కంటే మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దాంతో నిబంధనల ప్రకారం గేటు వద్ద ఉన్న పోలీస్ అధికారులు ఆమెను లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడటం వల్లే తాను పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నానని.. ఒక్క అవకాశం ఇచ్చి పరీక్ష రాయనివ్వాలని ఆమె అధికారులను ఎంతగానో వేడుకున్నది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేయడంతో, ఆమె తీవ్ర నిరాశతో అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

పరీక్ష రాసే తల్లికి భరోసా...పసిబిడ్డను ఎత్తుకున్న కానిస్టేబుల్‌ షర్ఫ్‌ ఉద్దీన్‌

‘‘లాఠీలకు కాఠిన్యమున్నా... ఖాకీలకు కనికరం’’ ఉంటుందని నిరూపించాడు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ఆప్యాయమైన మనసు కూడా ఉంటుందని నల్లగొండ జిల్లాలో ఓ పోలీస్ సిబ్బంది నిరూపించారు. ఎస్‌ఐ కావాలనే లక్ష్యంతో ప్రిలిమినరీ రాత పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మహిళా అభ్యర్థినికి ఎదురైన ఇబ్బందిని గుర్తించి, ఆమె కలకు ఆటంకం కలగకుండా అండగా నిలిచారు. తల్లి పరీక్ష రాసేందుకు హాల్‌‌లోకి వెళ్లేందుకు... తన చంటిబిడ్డను హాల్‌ ‌బయట వదిలేస్తే చూసుకునే వాళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించిన డిండి మండలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ షర్ఫ్ ఉద్దీన్ మానవత్వంతో స్పందించి పసిపాపను ఎత్తుకుని ఏడ్వకుండా చూసుకున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్