చూస్తుంటే నోరూరుతుంది

55 నిమిషాల క్రితం

It makes one
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 30, 2026 | 3 నిమిషాల చదవడం

కంటికి ఇంపు..ఒంటికి ముప్పు

ఆకర్షణ కోసం ఆహారంపై 
కృత్రిమ రంగుల పూత

కారం, పసుపులోనూ 
నిషేధిత రసాయనాలు

రంగుల వంటకం వెనుక 
ఎన్నెన్నో మోసాలు

నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ

​ఎర్రగా మెరిసే చికెన్‌ 65, నోరూరించే తందూరీ చికెన్‌, నారింజ రంగులో గోబీ మంచూరియా, రంగురంగుల బిర్యానీలు, కేకులు, మిఠాయిలు.. వీటిని చూడగానే తినాలనిపిస్తుంది. అయితే వాటికి ఆ రంగు ఎలా వచ్చింది? దాని వెనుక దాగున్న రహస్యం ఏమిటన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహజమైన కారం, పసుపుతో వచ్చిందా.? లేక కృత్రిమ రంగులు కలిపారా ? ఆ రంగుల వెనుక ఎలాంటి రసాయ నాలున్నాయి.? అవి మన ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం.? అని ఆలోచన చేస్తేనే ఒళ్లు జలదరించక మానదు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో చిన్న చిన్న హోటల్స్‌‌ల్లోనే కాదు.. పెద్ద పెద్ద హోటల్స్‌‌ల్లో ఇలాంటి ఎన్నో బయటపడ్డాయి. తయారు చేస్తున్న వారిపైనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

​ఆహార మాయాజాలం

హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో ఆహారాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు రకరకాల పదార్థాలను ఉపయోగిస్తున్నారు. చికెన్‌, చేపలు, పన్నీర్‌, గోబీ వంటి పదార్థాలను వేయించడానికి ముందు మైదా, మొక్కజొన్న పిండి, కారం, పసుపు, మసాలాలతో పూత వేస్తారు. దీనినే కోటింగ్‌ అంటారు. అయితే మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు కొందరు వ్యాపారులు కృత్రిమ రంగులను కూడా కలుపుతున్నారు.

​మితిమీరితే ముప్పే..

కొన్ని కృత్రిమ రంగుల పట్ల సున్నితత్వం ఉన్నవారిలో చర్మంపై దద్దుర్లు, దురద, అలెర్జీ, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాతాయని డాక్టర్లు అంటున్నారు. కొన్ని రంగులు చిన్నారుల ఏకాగ్రత, ప్రవర్తనపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నిర్దేశిత పరిమాణానికి మించి వాడటం, నిషేధిత రంగులను కలపడం వల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ​కారాన్ని మరింత ఎర్రగా చూపేందుకు సూడాన్‌ డైస్‌, పసుపును ఆకర్షణీయంగా మార్చేందుకు మెటానిల్‌ ఎల్లో, లెడ్‌ క్రోమేట్‌ వంటి నిషేధిత పదార్థాలను కలుపుతున్నట్టు తెలిసింది. రోడమైన్‌-బి అనే పారిశ్రామిక రంగును కూడా ఆహారంలో ఉపయోగించకూడదు. ఇలాంటి పదార్థాలు వాటి స్వభావం, మోతాదును బట్టి కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై విషప్రభావం చూపుతాయని డాక్టర్లు తెలిపారు.

​It makes one's mouth water just looking at it.తెల్లటి క్రీముల్లో ఏముంటుంది?

కేకులు, పేస్ట్రీలు, మిఠాయిలు, కొన్ని వంటకాలపై ఉపయోగించే క్రీముల్లో పాల మీగడతో పాటు మొక్కల నూనెలు, చక్కెర, చిక్కదనాన్ని ఇచ్చే పదార్థాలు ఉండొచ్చు. క్సాంతన్‌ గమ్‌, గ్వార్‌ గమ్‌, లెసిథిన్‌ వంటి పదార్థాలను నిబంధనలకు అనుగుణంగా వాడితే సాధారణంగా సురక్షితమే. చక్కెర, కొవ్వులు అధికంగా ఉండే క్రీములను తరచూ తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.

​రుచి, నిల్వ కోసం మరికొన్ని రసాయనాలు

పులుపు రుచి కోసం నిమ్మ ఉప్పు (సిట్రిక్‌ యాసిడ్‌), వెనిగర్‌ వాడతారు. అధిక వినియోగంతో కొందరిలో కడుపులో మంట, దంతాల రక్షణ పొర దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. పిండి పదార్థాలు పొంగేందుకు బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌ ఉపయోగిస్తారు. వంటసోడా అధికమైతే కడుపు ఉబ్బరం, శరీరంలో సోడియం మోతాదు పెరగవచ్చు. టేస్టింగ్‌ సాల్ట్‌ (ఎంఎస్‌జీ) ఆహార రుచిని పెంచుతుంది. అనుమతించిన విధంగా వాడితే సాధారణంగా సురక్షితమే.

​కల్తీని ఎలా గుర్తించాలి?

కారం పొడిని నీటిపై చల్లినప్పుడు ముదురు ఎరుపు రంగు వెంటనే ధారలుగా వ్యాపించినా, పసుపును నీటిలో కలిపినప్పుడు అసాధారణంగా ముదురు పసుపు రంగులోకి మారినా కల్తీపై అనుమానం కలగవచ్చు. సహజ రంగులు కూడా అంటుకునే అవకాశం ఉంది. ఇవి ప్రాథమిక పరిశీలనలు మాత్రమే. కల్తీని కచ్చితంగా నిర్ధారించేందుకు ప్రయోగశాల పరీక్షలు అవసరం.

​​అనుమతులున్నా.. పరిమితి తప్పనిసరి

భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కొన్ని కృత్రిమ రంగులను నిర్దిష్ట ఆహార పదార్థాల్లో మాత్రమే పరిమిత మోతాదులో వినియోగించేందుకు అనుమతించింది. అయితే వాటిని అన్ని రకాల వంటకాల్లోనూ ఉపయోగించడానికి వీల్లేదు. ఉదాహరణకు.. కొన్ని రకాల ఐస్‌క్యాండీల్లో టార్ట్రజైన్‌, సన్‌సెట్‌ ఎల్లో వంటి రంగులకు కిలో ఆహారానికి 100 మిల్లీగ్రాముల పరిమితి ఉంది. అంటే గ్రాములో పదో వంతు మాత్రమే. ఆహార పదార్థాన్ని బట్టి ఈ పరిమితులు మారుతాయి. చికెన్‌, చేపలు, కూరగాయలతో తయారు చేసే కబాబ్‌ల వంటి వంటకాల్లో కృత్రిమ రంగుల వినియోగానికి అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 18న రాజ్యసభలో స్పష్టం చేసిన విషయం తెల్సిందే.


రంగు కాదు.. ఆరోగ్యమే ముఖ్యం

​ఆహారంలో ఉపయోగించే ప్రతి రసాయనమూ హానికరం కాదు. ఏ రసాయనాన్ని, ఏ ఆహారంలో, ఎంత పరిమాణంలో వాడుతు న్నారనేదే ముఖ్యం. నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ రంగులు, పారిశ్రామిక రంగులను కలపడం ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడటమే. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లోనూ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలి.

డా. పి. మురళీధర్ రెడ్డి- అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం


​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్