ఎర్రజెండాను మోయాలంటే నిబద్ధత, చిత్తశుద్ధి, అంకితభావం కావాలి : మాస్ట్రో గజల్ శ్రీనివాస్
కుటుంబాన్ని పార్టీకి అంకితం చేసిన ఆదర్శ కమ్యూనిస్టు బాబన్న..
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
ప్రజా పోరాటాల్లో ఎగిరే ఎర్రజెండాలో బాబన్నను చూసుకుందాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
కొత్తగూడెంలో బాబన్న సంస్మరణ సభ
నవతెలంగాణ–కొత్తగూడెం
ప్రజా పోరాటాలు, ఉద్యమాల్లో కాలికి గజ్జె కట్టి తన ఆట, పాటలతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన భూక్య బాబన్నకు మరణం లేదని, ప్రజా నాట్యమండలి పాట ఉన్నంత కాలం ఆయన జీవించే ఉంటారని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రహీత, ప్రముఖ గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హనుమాన్ బస్తీలో బుధవారం సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, ప్రజా నాట్యమండలి కళాకారులు భూక్య బాబు (బాబన్న) సంస్మరణ సభ నిర్వహించారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగిన సభకు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావుతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ఎర్రజెండాను మోయడం అంటే దేశం బరువును మోయడమేనని, అందుకు నిబద్ధత, చిత్తశుద్ధి, అంకితభావం అవసరమని అన్నారు. ఈ లక్షణాలన్నీ సంపూర్ణంగా కలిగిన వ్యక్తి బాబన్న అని కొనియాడారు. స్వార్థంతోనే కొందరు ఎర్రజెండాను వీడుతారని, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసేవారు తుది శ్వాస వరకు ఎర్రజెండా సిద్ధాంతం కోసం నిలబడతారని తెలిపారు. బాబన్న జీవితం ఇందుకు నిదర్శనమన్నారు. బాబన్న సీపీఐ(ఎం) నాయకునిగా, ప్రజా నాట్యమండలి కళాకారునిగా ఏ ఆశయాల కోసం పనిచేశారో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఆస్తి సంపాదించుకునే జీవితం కాకుండా, మరణానంతరం కూడా అస్తిత్వం పొందే జీవితాన్ని బాబన్న గడిపారని అన్నారు. తండ్రి చూపిన మార్గంలో ఆయన కుమారులు రమేష్.. సీపీఐ(ఎం) నాయ కునిగా, రాజేష్ అభ్యుదయ భావజాలంతో సాహిత్యం, గజల్ గానం వైపు సాగు తున్నారని చెప్పారు. బాబన్న కుటుంబం అస్తిత్వాన్ని ఆస్తిగా భావిస్తూ జీవించడం సమాజానికి ఆదర్శమని అన్నారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ తన గజల్ పాటతో బాబన్నకు ఘన నివాళులర్పించారు.
పార్టీనే కుటుంబంగా భావించిన ఆదర్శ కమ్యూనిస్టు బాబన్న : బి. వెంకట్
పార్టీనే కుటుంబంగా భావించి తన కుటుంబాన్నే పార్టీకి అంకితం చేసిన ఆదర్శ కమ్యూనిస్టు బాబన్న అని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. బాబన్న భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన చేసిన కృషి.. నిర్వహించిన పాత్ర సజీవంగా ఉంటాయని చెప్పారు. కాసాని ఐలయ్య–కాసాని లక్ష్మి, భూక్య బాబు–భూక్య సుశీల దంపతులు పాటలు పాడుతూ, ఆటలాడుతూ కొత్తగూడెంలో పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేశారని కొనియాడారు. నేటికీ ఈ ప్రాంతంలో పార్టీ నిలబడి ఉందంటే ఆ దంపతుల కృషి ఎంతో ఉందని గుర్తుచేశారు. ఎస్ఎఫ్ఐ బలోపేతానికి భూక్య బాబు విశేషంగా కృషి చేశారని, విద్యార్థి ఉద్యమాలకు ప్రేరణగా నిలిచారని గుర్తుచేశారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు ఎదుర్కొన్నా తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడమే కాకుండా, తన కుటుంబాన్ని కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేలా తీర్చిదిద్దారని తెలిపారు. బాబన్న మరణం పార్టీకి తీరని లోటని, ఆయన ఆశయాలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బాబన్న మరణం పార్టీకి తీరని లోటు : పోతినేని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు నిల దీస్తూ, ప్రశ్నిస్తూ, ఎదిరిస్తున్న తరుణంలో భూక్య బాబన్న మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. విద్యార్థి ఉద్యమానికి అండగా నిలిచిన బాబన్న లాంటి నాయకులు నేటి తరానికి మరింత అవసరమని అన్నారు. కమ్యూ నిస్టులపై దాడులు జరుగుతున్న సమ యంలో, వామపక్ష భావజాలంపై చర్చలు సాగుతున్న తరుణంలో బాబన్న మన మధ్య లేకపోవడం విచారకరమని అన్నారు. ప్రపంచంలో సోషలిస్టు అనుకూల విధా నాల వైపు పరిణామాలు సాగుతున్న నేపథ్యంలో బాబన్న ఆశయాలను స్వీక రించి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. తన కుటుంబాన్ని సమాజానికి అంకితం చేసి, సమాజ శ్రేయస్సు, అభ్యున్నతి, ప్రగతి, మార్పు కోసం జీవి తాంతం కృషి చేసిన ఆదర్శ కుటుంబంగా బాబన్న కుటుంబం నిలిచిందన్నారు. ఆయన చేసిన కృషిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రజా పోరాటాల్లో ఎగిరే ఎర్రజెండాలో బాబన్నను స్మరించుకుంటూ, ఆయన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ర్ట కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






కామెంట్లు (0)