Magazines

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేల మధ్య
సవాళ్లు..ప్రతిసవాళ్లు

15 నిమిషాల క్రితం

Challenges and counter-challenges between Congress MLAs and former BRS MLAs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయ్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీ

నవతెలంగాణ-హనుమకొండచౌరస్తా

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు. సోమవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (డీసీసీ భవన్)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. మీ హయాంలో జరిగిన అభివృద్ధిపై మీకు నమ్మకం ఉంటే కేటీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ వంద అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని, వందసార్లు ముక్కు నేలకు రాసినా ఆయనను క్షమించే పరిస్థితిలో లేరని అన్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని అసంపూర్తిగా వదిలేసిందని, నిర్మాణ నాణ్యతపై ఎన్ఐటీ నిపుణులతో పరిశీలన చేయించాల్సి వచ్చిందని వివరించారు. రింగ్ రోడ్డు పేరుతో గత ప్రభుత్వం హడావుడి చేసి, శంకుస్థాపనలు చేసినప్పటికీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోనే రద్దయిందని విమర్శించారు. వరంగల్ విమానాశ్రయానికి గతంలో 696 ఎకరాల 14 గుంటల భూమి మాత్రమే ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 253 ఎకరాల భూమిని సేకరించిందని, ఇందుకోసం రూ.205 కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు.నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.550 కోట్లతో వాటర్ వర్క్స్ ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, అభివృద్ధికి కూడా నిధులు కేటాయించినట్లు తెలిపారు.

గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై పూర్తి ఆధారాలు, జీవోలు, నిధుల కేటాయింపులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని నాయిని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ..బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందించలేకపోయారని విమర్శించారు. కాళోజీ కళాక్షేత్రం రెండో అంతస్తులను కమర్షియల్ కాంప్లెక్స్‌కు అద్దెకు ఇచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జీవోలు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్ది రెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు శ్రీమాన్, తోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Challenges and counter-challenges between Congress MLAs and former BRS MLAsరాజీనామాలు, బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతల సవాల్

​​వరంగల్ నగర అభివృద్ధి, ఎన్నికల హామీల అమలుపై బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్‌లపై వ్యక్తిగత విమర్శలు మాని, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి దమ్ముంటే 24 గంటల్లో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు అభివృద్ధిపై హనుమకొండ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.​ కుడా మాజీ చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌నే కాంగ్రెస్ విడుదల చేసిందని తెలిపారు. మాజీ కార్పొరేటర్‌ జోరిక రమేష్ మాట్లాడుతూ కడియం శ్రీహరి, కావ్య విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డా. వాసుదేవరెడ్డి, సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, సుధీర్ కుమార్, ఎల్లావుల లలిత యాదవ్, పులి రజినీకాంత్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్