అక్రమార్కులకు కాసుల పంట
ఇసుకనూ, మట్టినీ తవ్వేస్తున్నారు..
పైసా ఖర్చు లేకుండా కోట్లు కొల్లగొడుతున్నా
చోద్యం చూస్తున్న మైనింగ్ శాఖ
దోపిడీకి గురవుతున్న సహజ వనరులు
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కొండలు, గుట్టలు ,అడవులు మాయమవుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా సహజ వనరుల(మైనింగ్ , ఇసుక, మట్టి, గ్రావెల్, కొండలు)ను కొల్లగొడుతూ కోట్లు వెనకేసుకుంటున్నా మైనింగ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సహజ సంపద దోపిడీ ఒక తీవ్రమైన ఆందోళనకర అంశంగా మారింది. జిల్లాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాల్సిన మైనింగ్ , ఇసుక, మట్టి రవాణా ప్రస్తుతం కొందరి స్వార్థానికి బలవుతూ "ఆదాయమా... అనర్థమా?" అనే చర్చకు దారితీస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిన ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరొందింది. కానీ ఈ ప్రాంతంలో ప్రకృతి సంపదకు కొదవలేదు. అపారమైన సహజ వనరులు ఉన్నాయి. కృష్ణా, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాలు, అమ్రాబాద్ నల్లమల అడవులు, విలువైన క్వారీలు, ఇసుక రీచ్లు జిల్లాకు ప్రకృతి ఇచ్చిన వరాలు. ఈ సహజ సంపద ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని పెంచడం కంటే, కొందరు అక్రమార్కుల జేబులు నింపడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ దోపిడీ జిల్లా పర్యావరణాన్ని, ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.
ఇసుక మాఫియా కృష్ణమ్మ ఒడినీ గుల్ల చేస్తోంది.
ఉమ్మడి జిల్లాలోని జూరాల బ్యాక్ వాటర్ ప్రాంతాలు, కృష్ణా నది పరివాహక మండలాలైన గద్వాల, అలంపూర్, మక్తల్, నారాయణపేట, నాగర్ కర్నూల్ పరిధిలోని నది తీరాల నుంచి రాత్రింబవళ్లు ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ప్రభుత్వ అనుమతులు ఉన్న క్వారీల కంటే అనుమతులు లేని చోట్లే యంత్రాల ద్వారా భారీగా ఇసుకను తవ్వేస్తున్నారు. ఒక్కో ప్రధాన వాగు (ఉదాహరణకు కోయిల్కొండ మండలం రాకొండ ) నుంచి సుమారు 50 నుండి 60 టిప్పర్ల ఇసుక మహబూబ్నగర్, నారాయణపేట, హైదరాబాద్ వంటి నగరాలకు అక్రమంగా ఇసుక తరలిపోతోంది. దీనివల్ల భూగర్భ జలమట్టం పడిపోవడమే కాకుండా, నదీ తీర ప్రాంతాల్లో సాగునీటి బావుల ఉనికి ప్రమాదంలో పడింది. నదీ పర్యావరణ వ్యవస్థ దెబ్బతిని మత్స్యకారుల ఉపాధి సైతం దెబ్బతింటోంది. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న నాగర్ కర్నూల్, అచ్చంపేట పరిసరాల్లో విలువైన కలప అక్రమ రవాణా జరుగుతున్నది.
ఆదాయం పెంచేందుకు...
రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న జీరో ఇల్లీగల్ మైనింగ్ జీరో ఓవర్ లోడింగ్, జీరో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ విధానం వల్ల మైనింగ్ శాఖల ఆదాయం పెంచేందుకు నిఘా పెంచారు. నాగర్ కర్నూల్ , జోగులాంబ గద్వాల లాంటి జిల్లాలలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డి ఎం ఎఫ్ టి ) నిధులు కూడా మైనింగ్ లీజుదారుల నుంచి క్రమంగా వసూలవుతున్నాయి, వీటిని స్థానిక ప్రాంతాల అభివృద్ధికి వాడుతున్నారు.అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. డ్రోన్ సర్వైలెన్స్, ఆన్లైన్ పర్మిట్లు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ, సరిహద్దు ప్రాంతాలలో రాత్రి వేళల్లో ఇసుక, గ్రానైట్ అక్రమ రవాణా పూర్తిగా అదుపులోకి రాలేదు. అనుమతించిన క్వారీ పరిమితుల కంటే ఎక్కువ లోతుకు తవ్వకాలు జరపడం వల్ల ప్రభు త్వానికి రావాల్సిన అసలైన రాయల్టీ కోల్పోవాల్సి వస్తోంది.
రాజకీయ అండదండలు
ఈ అక్రమ మైనింగ్ , రవాణా వెనుక రాజకీయ, అధికార బలగాలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నిఘా పెట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల రాయల్టీ గండి పడుతోంది. చట్టబద్ధంగా మైనింగ్ జరిగితే జిల్లా అభివృద్ధికి ఉపయోగపడే ఆదాయం వచ్చేది.
ఏడాదికి 350 క్వారీల నుంచి కోట్ల వ్యాపారం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 300 నుండి 350 వరకు చట్టబద్ధమైన క్వారీ లీజులు/అనుమతులు వివిధ ఖనిజాల కోసం ఉన్నాయి. వీటిలో ప్రధానంగా రోడ్ మెటల్ కంకరబిల్డింగ్ మెటీరియల్ క్వార్ట్జ్ , ఫెల్డ్స్పార్ , అలాగే నారాయణపేట, జోగులాంబ గద్వాల సరిహద్దుల్లో బ్లాక్ ,కలర్ గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. కొత్త జిల్లాల విభజన తర్వాత ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్న నాగర్ కర్నూల్ , మహబూబ్ నగర్ జిల్లాలలోనే అత్యధిక క్వారీ లీజులు యాక్టివ్గా నడుస్తున్నాయి.మహబూబ్ నగర్ జిల్లా నుండి సగటున ఏడాదికి రూ.25 కోట్ల నుండి రూ.35 కోట్ల వరకు అధికారిక మైనింగ్ ఆదాయం సమకూరుతోంది. వనపర్తి, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో మేజర్ క్వారీలు తక్కువగా ఉన్నప్పటికీ, కృష్ణా నది ఇసుక రీచ్లు, స్థానిక కంకర క్వారీల ద్వారా ఒక్కో జిల్లా నుండి ఏడాదికి సగటున రూ.10 కోట్ల నుండి రూ.25 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.ప్రభుత్వ రీచ్ ద్వారా తక్కువ ధరకే దొరకాల్సిన ఇసుకను మాఫియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో టిప్పర్ రూ.35000 నుండి రూ.50000 వరకు విక్రయిస్తూ పైసా ఖర్చు లేకుండా కోట్టు గడిస్తోంది. అదేవిధంగా క్యూబిక్ మీటర్ మొరం లేదా కంకర తవ్వకాలకు మైనింగ్ శాఖకు చెల్లించాల్సిన రాయల్టీని ఎగవేయడం వల్ల ఒక్కో వెంచర్ లేదా కాంట్రాక్టు పనిలో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతోంది.
మాఫియా ఆగడాలు అరికట్టాలి
జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతు న్నాయి. ఎక్కడ చూసినా ఇసుక, గుట్టలను ద్వంసం చేస్తూ... అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రకృతి సంపద ను కొల్లగొడుతూ... కోట్లు కొల్లగొడుతున్నారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.
- ఎ. రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్ జిల్లా






కామెంట్లు (0)