Magazines

​30 లోపు ఈఎస్ఐ హాస్పిటల్‌ను పునరుద్ధరించాలి

11 నిమిషాల క్రితం

ESI hospital
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి

నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్

కార్మికులకు ఉపయోగపడే ఈఎస్ఐ ఆస్పత్రి భవనానికి 12 నెలల అద్దె బకాయి పడిందని, ఎన్నిసార్లు అడిగినా చెల్లించకపోవడంతో భవన యజమాని తాళం వేశారని, ఈనెల 30లోపు పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ ‌చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు నెలల కరెంటు బిల్లు, 12 నెలల భవన అద్దె బకాయి ఉండటంతో యజమాని తాళం వేశారని తెలిపారు. వారం రోజులుగా ఆస్పత్రి మూతపడటంతో కార్మికులు ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చి వైద్యం పొందలేక ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కార్మికుల డబ్బే ఈఎస్ఐ ఆస్పత్రి అని తెలిపారు. భవనం అద్దె ఎందుకు ఇవ్వడం లేదని తాను అనేకసార్లు అధికారులను అడిగానని అయినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళం వేస్తామని యజమాని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

జనవరి నుంచి ప్రయివేట్‌ భవనంలో కాకుండా ప్రభుత్వ భవనంలో ఆస్పత్రి నిర్వహించాలని ప్రభుత్వం కలెక్టర్‌ను ఆదేశించినా.. ఇప్పటివరకు ప్రభుత్వం భవనం చూపించలేదని తెలిపారు. చూపించాల్సిన బాధ్యత కలెక్టర్‌, అధికారులదేనని తెలిపారు.

వేలాది మంది కార్మికులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న మిర్యాలగూడ ప్రాంతానికి ఎంతో పోరాడి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2013 అక్టోబర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రిని మంజూరు చేయించానని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రయివేట్‌ భవనంలోనే నడుస్తోందని వివరించారు.‌ ప్రయివేట్‌ భవన అద్దె అయినా క్రమం తప్పకుండా ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వ భవనం అయినా చూపించాలని సూచించారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఖాళీ ఉందని, లేకపోతే ఎన్ఎస్పీ క్యాంప్ ఏరియాలో అయినా మంజూరు చేసి వెంటనే ఆస్పత్రి తెరిచేలా చూడాలని కోరారు. 30వ తేదీలోపు ఆస్పత్రిని తెరిచి కార్మికులకు వైద్య సేవలు అందించకపోతే ఈఎస్ఐ ఆస్పత్రి ముందు కార్మికులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శులు మల్లు గౌతమ్ రెడ్డి, బావండ్ల పాండు, సీఐటీయూ నాయకులు రామచంద్రు, దేవయ్య పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్