పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి
కనీస వేతనం అమలు చేయకుండా శ్రమ దోపిడీ : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
నవతెలంగాణ-సంగారెడ్డి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై డిసెంబర్ 1,2, 3 తేదీల్లో పార్లమెంట్ ముట్టడిలో కార్మికవర్గం పాల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డిలో జరిగిన సీఐటీయూ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ వాటి స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్స్ అమలుతో కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా శాశ్వత ఉద్యోగాల్లో సైతం కాంట్రాక్ట్, నిర్ణీత కాల ఉద్యోగాలుగా మార్చుతున్నారని విమర్శించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను అప్పగించే విధానాలను వీడాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వల్ల గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయన్నారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరల రీత్యా కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో పని చేస్తూ కార్మికులు తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. కార్మికుల శ్రమను కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలు దోచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్మికుల ఉద్యోగ భద్రతను దెబ్బతీసే చర్యలు మానుకోవాలని కోరుతూ జరుగుతున్న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు, నాయకులు రాజయ్య, పాండురంగారెడ్డి, మహిపాల్, ప్రవీణ్, రమేష్, మంగ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)