మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనేక హామీలు, డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసిందని మాజీ మంత్రి జి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతోమాట్లాడుతూ తులం బంగారం ఇస్తామనీ, ఫించన్ల మొత్తం పెంచుతామని ఊదర గొట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజలు చిత్తు కాగితాల్లాగా చూస్తున్నారని ఆరోపించారు. ఆ మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేయాల్సిందేనని చెప్పారు. తెలంగాణకు నవంబర్ 17ను బ్లాక్ డేగా మార్చారని అన్నారు. అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ భూ స్థాపితం కావడం ఖాయమని అన్నారు. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల మోసాలకు వేరే దేశాల్లోనైతే ఉరి వేసేవారని చెప్పారు. సామూహిక సెలవు పెడితే ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని బెదిరిస్తారా?అని అన్నారు. దమ్ముంటే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు సస్పెండ్ చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి, మెతుకు ఆనంద్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు : టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్
సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు హామీ ఏమైందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూడేండ్ల క్రితం ఆరు గ్యారంటీలతో పాటు సుమారు 420 హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాలనూ మోసం చేసిందని పేర్కొన్నారు. ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం వైఫల్యానికి బాధ్యత వహించి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు.







కామెంట్లు (0)