ఖాకీ వెనుక కనిపించని మహిళల కన్నీటి కథ
ఇంటి బాధ్యతలు.. బయట విధులు.. రెండింటి మధ్య నలిగిపోతున్న మహిళా పోలీసులు
విశ్రాంతి, వీక్లీ ఆఫ్, కుటుంబ సమయంపై ప్రత్యేక దృష్టి అవసరం
నవతెలంగాణ - రాజన్న సిరిసిల్ల
ఒకవైపు ఇంట్లో పిల్లల ఎదురుచూపులు.. మరోవైపు విధి నిర్వహణలో ప్రజల భద్రతా బాధ్యతలు! బిడ్డకు అనారోగ్యమొచ్చినా.. ఇంట్లో పెద్దలకు ఆరోగ్యం బాగోలేకపోయినా.. పండుగైనా, కుటుంబంలో శుభకార్యమైనా.. అన్నింటినీ పక్కనపెట్టి ఖాకీ పిలుపునకు స్పందించాల్సిన పరిస్థితి. విధి నిర్వహణలో కఠినంగా కనిపించే మహిళా పోలీసుల వెనుక ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో త్యాగాలు దాగి ఉంటాయి. ఇంట్లో తల్లిగా.. భార్యగా.. కుమార్తెగా బాధ్యతలు నిర్వహిస్తూనే, బయట సమాజానికి రక్షణగా నిలుస్తున్నారు. వారి సేవలకు ప్రశంసలు దక్కుతున్నా.. వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగిన పరిష్కారం లభిస్తోందా అనేది ప్రశ్నగా మిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఐ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు 43 మంది మహిళలు పనిచేస్తుండగా 21 మంది మహిళా హోంగార్డులు పనిచేస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 64 మంది మహిళలు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు.
విధుల్లో ఎన్నో సవాళ్లు..
పోలీసు శాఖలో మహిళల భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, మహిళలపై నేరాల విచారణ, రాత్రి గస్తీ, ప్రజా కార్యక్రమాల బందోబస్తు ఇలా అన్ని విభాగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆందోళనలు, ధర్నాలు, బహిరంగ సభలు, పండుగల సమయంలో గంటల తరబడి విధులు నిర్వహించాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడు పిలుపు వచ్చినా అందుబాటులో ఉండాల్సిందే. విధులు ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా చాలాసార్లు ఉండదు. అదనపు బందోబస్తు విధులు, ఆకస్మిక పిలుపులు వారి దినచర్యను మార్చేస్తుంటాయి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు తల్లి కనిపించకపోవడం.. పరీక్షల సమయంలో దగ్గరుండి చదివించలేకపోవడం.. అనారోగ్యంతో ఉన్నప్పుడు పక్కన ఉండలేకపోవడం వంటి పరిస్థితులు మహిళా పోలీసులను మానసికంగా కలచివేస్తుంటాయి.
ప్రత్యేక సౌకర్యాలూ లేవు
మహిళా పోలీసుల సంక్షేమం అంటే కేవలం సెలవులు మంజూరు చేయడం మాత్రమే కాదు. పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విశ్రాంతి గదులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, సురక్షితమైన వసతులు కల్పించాలి. రాత్రి విధులు, దీర్ఘకాలిక బందోబస్తుల అనంతరం తగిన విశ్రాంతి ఉండేలా చూడాలి. వీలైనచోట షిఫ్టుల విధానం అమలు చేయాలి. కుటుంబం అత్యవసర పరిస్థితుల్లో సెలవులు పొందే వెసులుబాటు కల్పించాలి. కౌన్సెలింగ్, ఆరోగ్య పరీక్షలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి. మహిళా పోలీసుల అభిప్రాయాలను సేకరించి విధుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించాలి. వారి అవసరాలకు అనుగుణంగా విధుల పునర్విభజన చేపట్టాలి. ఖాకీ ధరించినంత మాత్రాన మహిళల వ్యక్తిగత భావోద్వేగాలు మాయమైపోవు. ప్రస్తుతం విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది సంక్షేమానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక మహిళా పోలీసు విధి నిర్వహణలో సమర్థంగా ఉండాలంటే.. ఆమె వెనుక ఉన్న కుటుంబానికి భరోసా, ఆమెకు శాఖ నుంచి అండదండలు అవసరం.






కామెంట్లు (0)