ధాన్యం కొనుగోలు చేయకుండా దళారుల పాలు చేస్తున్నారు
ధాన్యం కొనుగోళ్లు
వేగవంతం చేయాలి : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-కల్హేర్
: ధాన్యం కొనుగోలు కేంద్రాలను హడావిడిగా ప్రారంభించినప్పటికీ.. ఇప్పటివరకు కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోస ఈ ప్రభుత్వానికి పట్టడం లేదంటూ మండిపడ్డారు. నారాయణఖేడ్ పర్యటనలో భాగంగా మండల కేంద్రమైన నిజాంపేట గ్రామంలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ఆరుగాలం రైతులు కష్టపడి పంట పండిస్తే.. కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. కోతలు పూర్తి చేసుకుని నెల రోజుల కిందటే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారని.. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేద న్నారు. దానికితోడు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కూడా లేవన్నారు. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. రైతులు చలిలో చేస్తుంటే నాయకులు మాత్రం పట్టించుకోకుండా పాలనను గాలికి వదిలేసారన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఒకవైపు సాగుకు సరిపడా విద్యుత్, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు కష్టపడి పండించిన పంటను కూడా ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, బార్ దాని గోనె సంచులు, రవాణా సదుపాయాలు కల్పించి ధాన్యం కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ , రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, బిక్షపతి, బీఆర్ఎస్ మండలాధ్య క్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)