ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య
సారంపల్లి మల్లారెడ్డి నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రైతాంగ, విద్యార్థి, యువజన ఉద్యమాలు ఐక్యంగా ముందుకు సాగితేనే కార్పొరేట్ శక్తులు, నయా ఫాసిస్టు విధానాలను సమర్థంగా ఎదుర్కోగలమని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య పిలుపునిచ్చారు. సారంపల్లి మల్లారెడ్డి నగర్ (నల్లగొండ)లో కొనసాగుతున్న ఏఐకేఎస్ 36వ మహాసభలో ఆయన మంగళవారం సౌహార్ద సందేశమిచ్చారు. వ్యవసాయం, విద్యారంగాలు కార్పొరేట్ శక్తుల దోపిడీకి గురవు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వ్యవసాయం, విద్యారంగాల్లో తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయని విమర్శిం చారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం, లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావడం ఆందోళనకరమన్నారు. వ్యవసాయ సంక్షోభంతో గ్రామీణ పేద, రైతు కుటుంబాల పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్లాల్సి వస్తోందనీ, బాలికలకు బాల్యవివాహాలు చేస్తున్నారని చెప్పారు.
గతంలో పంపిణీ చేసిన భూములు భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరుగు తున్నా రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించడం లేదని విమర్శించారు. చిన్న, మధ్యతరహా రైతులు వ్యవసాయాన్ని వదిలివెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోకి విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వెళ్లి రైతు కుటుంబాలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. నయా ఫాసిస్టు శక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థల ను బలహీనపరుస్తూ, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు. మార్క్సిజం, వర్గపోరాట స్ఫూర్తిని ఎవ్వరూ అంతం చేయలేరని స్పష్టం చేశారు. రైతులను ఏకతాటిపైకి తీసుకు రావడంలో ఏఐకేఎస్ సుదీర్ఘ అనుభవం ఆదర్శప్రాయమని కొనియాడారు.







కామెంట్‌లు (0)