రోడ్డుపై ఆగిన కోళ్ల వ్యాన్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి
కుమారుడిని విమానాశ్రయంలో వదిలి తిరిగొస్తుండగా ఘట
నవతెలంగాణ-జహీరాబాద్
రోడ్డుపై ఆగి ఉన్న కోళ్ల వ్యాన్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులోని అల్గోల్ చౌరస్తా వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమర్గా తాలూకా మురుము గ్రామానికి చెందిన శరణప్ప (60), భార్య సుష్మ(55) దంపతులు. తమ కుమారుడు వీరప్ప.. నేపాల్ దేశం నందు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా, సెలవుల నిమిత్తం గ్రామానికి వచ్చిన కుమారుడిని నేపాల్‌కు పంపించేందుకు సోమవారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లి, విమానం ఎక్కించిన అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో జహీరాబాద్ బైపాస్‌లోని అల్గోల్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న కోళ్ల వ్యాన్‌ను వారి కారు ఢీకొట్టింది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన దంపతులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి సీఐ రవి, ఎస్‌ఐ లవ కుమార్ పంచనామా నిర్వహించారు.
డ్రైవర్‌ను పడుకోమని చెప్పి...
ఇంటి నుండి తమ వాహనంలో హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కొడుకును దింపేందుకు వచ్చిన దంపతులు.. కారు డ్రైవర్ షేక్ అజీముద్దీన్‌కు నిద్రమత్తుగా ఉండటంతో కాసేపు వెనుక సీట్లో పండుకోమని చెప్పి శరణప్ప వాహనాన్ని నడిపారు. ఈ క్రమంతోనే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని బంధువులు ఆయన కుమారునికి తెలియజేశారు. దీంతో వీరప్ప ఢిల్లీలో దిగి అక్కడి నుంచి తిరిగి రానున్నారు.





కామెంట్‌లు (0)