ఏఐకేఎస్ బహిరంగ సభకు కదం తొక్కిన
రెడ్ షర్ట్ వాలంటీర్లు
నల్లగొండ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి:- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటగడ్డ నల్లగొండ ఎర్రగొండగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి కదిలొచ్చిన రైతాంగంతో పట్టణం జనసంద్రమైంది. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ మహాసభలను పురస్కరించుకుని ఆదివారం అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. పట్టణంలోని మర్రిగూడ బైపాస్ నుంచి ఎన్జీ కళాశాల ప్రాంగణం వరకు నాలుగు కిలోమీటర్ల మేర రెడ్ షర్ట్ వాలంటరీలతో కూడిన మహా ప్రదర్శన సాగింది. ముందు వరుసలో ఏఐకేఎస్ జాతీయ నాయకత్వం నడిచింది. ప్రదర్శనను పట్టణ ప్రజానీకం ఆసాంతం తిలకించింది. ఎడ్ల బండ్ల ప్రదర్శన ఆకట్టుకుంది. బహిరంగ సభ వేదికపై నల్లగొండ గద్దర్ (నర్సిరెడ్డి), సుక్క రాంనర్సయ్య, పిఎన్ఎం కళాకారులు జగన్, ఆనంద్, వెంకట్ రెడ్డి, తదితర కళాకారుల ఆటపాటల సమయంలో కేరింతలు, ఈలలతో సభలో ఉత్తేజ పూరిత వాతావరణం నెలకొంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని మహాసభ పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విభజించు పాలించు రాజకీయాలను తిప్పికొడుతూ యువత, రైతాంగం, ప్రజానీకం ఐక్యమై పోరు బాట పట్టాలని పిలుపునిచ్చింది.












కామెంట్‌లు (0)