సమన్వయంతో నిమ్స్, సనత్‌నగర్ టిమ్స్ వైద్యసేవలు : వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లకు సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో సర్జరీలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. నిమ్స్‌లో పెరుగుతున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వసతులను సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో నిమ్స్‌లోని వివిధ విభాగాల హెచ్‌వోడీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నమ్మకం, విశ్వాసంతో నిమ్స్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందనీ, నిమ్స్‌లో సర్జన్లు తగినంత మంది ఉన్నప్పటికీ, ఆపరేషన్ థియేటర్లు పరిమితంగా ఉండటంతో యూనిట్ల వారీగా రొటేషన్ పద్ధతిలో సర్జరీలు నిర్వహించాల్సి వస్తోందని డాక్టర్లు మంత్రికి వివరించారు.
దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని నిమ్స్ వైద్యులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
ప్రతి రోగికీ సకాలంలో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రెండు ఆస్పత్రులు సమన్వయంతో పనిచేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. నిమ్స్ హెచ్‌వోడీలంతా వెంటనే డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలని ఆదేశించారు.
సర్జరీల నిర్వహణకు అదనంగా ఏవైనా వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలు అవసరమైతే వాటిని సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. టిమ్స్‌లో డాక్టర్ల నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి మంత్రి సూచించారు. నియామకాలు పూర్తయ్యే వరకూ నిమ్స్ డాక్టర్ల సహకారం కొనసాగించాలన్నారు.






కామెంట్‌లు (0)