ట్రాఫిక్ కష్టాలకు చెక్
లాస్ట్-మైల్ కనెక్టివిటీపై హెచ్ఎంఆర్ఎల్ అధ్యయనం
ఐటీ కారిడార్, నగర కేంద్ర ప్రాంతాల్లో రెండు రూట్ల గుర్తింపు
పీపీపీ విధానంలో అమలుకు సన్నాహాలు : ఎండీ సర్ఫరాజ్ అహ్మద్
భాగస్వామ్య పక్షాలతో విస్తృత స్థాయి వర్క్‌షాప్ నిర్వహణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణికులకు లాస్ట్-మైల్ కనెక్టివిటీని సులభతరం చేసేందుకు, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అత్యాధునిక ‘పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ (పీఆర్టీఎస్) ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) సన్నాహాలు ముమ్మరం చేసింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై లీ అసోసియేట్స్ సౌత్ ఆసియా ప్రయివేట్ లిమిటెడ్ రూపొందించిన అధ్యయన నివేదికపై మంగళవారం హైదరాబాద్‌లో వివిధ భాగస్వామ్య పక్షాల (స్టేక్హోల్డర్ల)తో ఉన్నత స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు.
హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో సుస్థిర రవాణా పరిష్కారాలు అన్వేషించాలని సీఎం ఎ. రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అధ్యయనం చేపట్టినట్టు తెలిపారు. పీఆర్టీఎస్ వ్యవస్థ పర్యావరణహిత, సాంకేతిక ఆధారిత రవాణాగా నిలవడమే కాకుండా.. ప్రయివేటు వాహనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, మెట్రో ప్రయాణికుల సంఖ్యను పెంచుతుందని వివరించారు. ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులు మెట్రో స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడంలో ఈ వ్యవస్థ కీలకమవుతుందన్నారు. ఈ సందర్భంగా లీ అసోసియేట్స్ ప్రతినిధి బి.ఎం.సెట్టి ప్రజెంటేషన్ ద్వారా రెండు అధ్యయన ప్రాంతాలను వివరించారు. ఇందులో కారిడార్ -1లో రాయదుర్గం - కూకట్పల్లి, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాలు ఉండగా.. కారిడార్-2లో రాష్ట్ర సచివాలయం, హుస్సేన్ సాగర్, బేగంపేట్, అసెంబ్లీ, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాలు ఉంటాయి. వీటి పరిధిలో డిపోల ఏర్పాటు, ప్రయాణికుల రాకపోకల అంచనాలు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను చర్చించారు. ఈ సదస్సులో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, డీసీపీ రాహుల్ హెగ్డే, ఎల్అండ్ టీ మెట్రో ఎండీ కె.వి.బి. రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ సీపీఎం బి. ఆనంద్ మోహన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే అధికారులు హాజరయ్యారు. అలాగే రహేజా, మీనాక్షి, టెక్ మహీంద్రా వంటి కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, ఐఐటీ, ఐఐఐటీ, ఓయూ నిపుణులు పాల్గొని పలు సూచనలు చేశారు.







కామెంట్లు (0)