Magazines

హోంగార్డుల సమస్యల్ని పరిష్కరించాలి

24 అక్టోబర్, 2026

home guards
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

సంక్షేమ పథకాలు అమలు చేయాలి బకాయిలు విడుదల చేయాలి

చనిపోయిన, రిటైర్డ్‌ అయిన
 హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలి : సీఎం రేవంత్‌‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ లేఖ


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
అరకొర వేతనాలతో శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించిన హోం గార్డుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ కోరారు. శనివారం ఈ మేరకు సీఎం రేవంత్‌‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘30 నుంచి 40 ఏండ్ల పాటు సేవలందించిన హోంగార్డులకు పదవీ విరమణ తర్వాత పీఎఫ్, ఈఎస్‌ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ప్రస్తుతం దాదాపు పదివేల హోంగార్డు కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 61 ఏండ్లు, అంగన్‌వాడీలకు 65 ఏండ్ల పదవీవిరమణ వయస్సు అమలవుతున్నప్పటికీ, హోంగార్డులను మాత్రం 60 ఏండ్లకే బలవంతంగా విధుల నుంచి తొలగించడం సరికాదు. ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులను ప్రభుత్వాస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్ యార్డులు, హాస్టళ్లలో వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డులు, వార్డెన్లుగా నియమించి ఆదుకోవాలి’ అని లేఖలో కోరారు. ‘ఎలాంటి సర్వీస్ బెనిఫిట్లు కూడా లేని హోంగార్డులకు అంగన్‌వాడీల తరహాలోనే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి.


13 ఏండ్లుగా హోంగార్డులు తమ సొంత జీతం నుంచి ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తూ, మరణించిన, రిటైర్ అయిన సహచర కుటుంబాలకు రూ.3 లక్షల వరకు అందించే “ఒక్క రోజు వేతనం” సంక్షేమ సహాయాన్ని పోలీస్ శాఖ నిలిపివేయడం సరిగాదు. వందలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కావున, ఈ వ్యవస్థను తక్షణమే పునరుద్ధరించాలి. ప్రతి హోంగార్డుకు అందాల్సిన రూ.7,500 యూనిఫాం అలవెన్స్ బకాయిలను (ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్నవి) వెంటనే విడుదల చేసి సర్వీసులో ఉన్నవారితో పాటు రిటైర్డ్, మరణించిన వారి కుటుంబా లకు అందించాలి’ అని లేఖలో ప్రస్తావించారు. ‘ఏపీలో హోంగార్డుల సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతున్నట్లే, మన రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, వృద్ధాప్య పింఛన్లు, మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి’ అని కోరారు. ఈ విషయంలో సీఎం తక్షణమే జోక్యం చేసుకుని, సంబంధిత శాఖాధికారుల తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, వీలైనంత త్వరగా హోంగార్డుల న్యాయమైన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్