ప్రజా నాట్య మండలి కళాకారుల ప్రదర్శనను తిలకించిన ప్రతినిధులు
సారంపల్లి మల్లారెడ్డి నగర్(నల్లగొండ) నుంచి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను, ఆనాటి ప్రజల చైతన్య స్ఫూర్తిని ప్రజానాట్యమండలి కళాకారులు ‘వీర తెలంగాణ’ నాటకం ద్వారా కండ్లకు కట్టినట్టు చూపారు. ఏఐకేఎస్ 36వ మహాసభలు జరుగుతున్న సారంపల్లి మల్లారెడ్డినగర్(నల్లగొండ)లో మంగళ వారం రాత్రి ప్రజానాట్యమండలి కళాకారులు వీర తెలంగాణ నాటికను ప్రదర్శించారు.
నిజాం కాలంలో తెలంగాణలోని నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీ, దొరల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన చారిత్రాత్మక పోరాటాన్ని
నాటకం ప్రతిబింబించింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పేద రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు సాగించిన పోరాటాలు, త్యాగా లను కళాకారులు తమ అభినయం, సంభాషణలు, పాటల ద్వారా ఆవిష్కరించారు. ఈ నాటకం మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చరిత్రను భావితరాలకు అందించేలా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు స్ఫూర్తి పొందేలా ప్రజానాట్యమండలి కళాకారులు పాత్రల్లో లీనమై ప్రతినిధులను మైమరిపించారు. వేల్పుల వెంకన్న (దొర), విజయ(చిట్యాల ఐలమ్మ), కట్ట నర్సింహ (కరణం), మధు(దొడ్డి కొమరయ్య), జాన్‌బీ(మల్లు స్వరాజ్యం), పుచ్చలపల్లి సుందరయ్య (నాంపల్లి చంద్రమౌళి), సతీశ్ (జీతగాడు), బూర్గుల ప్రభాకర్ (ధర్మాపురం రైతు), రాంబాబు(దళనాయకుడు), అశోక్, కుమ్మరి శంకర్(దళ సభ్యులు), శ్రీకృష్ణ(చిన్న పాలేరు), సురేశ్(ఖాశీం రజ్వీ), మేడి అంజమ్మ(మహిళా సంఘం నాయకులు), తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ నాటకానికి నేపథ్యగానాన్ని గంటెపాక శివ అందించగా పి.వెంకట్‌రెడ్డి కోరస్ ఇచ్చారు. వీర్నపల్లి ముత్యాలు పాటలు పాడారు. దేశపాక రవి డప్పు కొట్టారు. వాయిద్య సహకారాన్ని పృథ్వీ, ఎం.అయిలయ్య అందించారు. వీరతెలంగాణ నాటకంలో 25 మంది కళాకారులు పాలుపంచుకున్నారు. నాటకం అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య పాటకు పీఎన్‌ఎమ్ కళాకారులతో పలువురు ప్రతినిధులు కలిసి స్టెప్పులేశారు.







కామెంట్‌లు (0)