Magazines

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు..!!

1 గంట క్రితం

This is a famine brought about by the Congress.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం

కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే..

ఇక్కడే ఉన్న వనపర్తిలో ఎందుకు పారవు?

నీళ్లకు, కరెంటుకు, పంటలకు సెలవంటున్న రేవంత్ కే

ప్రజలు ‘టాటా.. బాయ్ బాయ్’ చెప్పాలి

శ్రీశైలంలో 221 టీఎంసీలు, జూరాలలో

252 టీఎంసీల నీళ్లు వచ్చినా..పంటలు ఎండబెట్టారు

అల్వాల రైతు సభలో మాజీ మంత్రి హరీశ్ రావు

వనపర్తి జిల్లాలో ఎండిన పంటల పరిశీలన

నవతెలంగాణ - వనపర్తి

ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. రేవంత్ రెడ్డి చేతగానితనం తెచ్చిన కరువు అని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌‌రావు అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో సాగునీరు అందక ఎండిపోయిన వందలాది ఎకరాల వరి పంట పొలాలను సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస గౌడ్‌, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేతికొచ్చే దశలో ఎండిపోయిన వరి పైరును చూపిస్తూ కన్నీటిపర్యంతమైన రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం అల్వాల గ్రామంలో నిర్వహించిన

రైతు బహిరంగ సభలో హరీశ్‌‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా కరువును వెంటేసుకొని వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది వర్షాకాలంలో పైనుంచి మన రాష్ట్రానికి నీళ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం చేతగానితనం వల్ల మోటార్లు ఆన్ చేయకపోవడంతో వ్యవసాయానికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. కల్వకుర్తి కింద 50 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా.. 18 టీఎంసీలే ఎత్తిన సీఎం రేవంత్‌‌రెడ్డి తన.. గురువు చంద్రబాబుకు నీళ్లు వదిలేశారన్నారు. 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే.. పక్కనే ఉన్న వనపర్తికి 70 కి.మీ దూరంలో ఉన్న నీళ్లు ఎందుకు పారవని ప్రశ్నించారు. నీళ్లకు, కరెంటుకు, పంటలకు సెలవు అంటున్న రేవంత్ రెడ్డికే ప్రజలంతా ‘టాటా.. బాయ్ బాయ్’ చెప్పాలని పిలిపిచ్చారు. కృష్ణా జలాల్లో కేసీఆర్ హయాంలో 41 శాతం నీళ్లు వాడుకుంటే.. రేవంత్ రెడ్డి పాలనలో 25 శాతానికి పడిపోయిందన్నారు. కండ్లముందు పారుతున్న కృష్ణా నీళ్లను కూడా ఎత్తలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. అప్పట్లో జూరాలకు వరద తాకకముందే మంత్రులకు ఫోన్లు చేసి మోటార్లు నడిపించి చెరువులు నింపిన ఘనత కేసీఆర్‌దన్నారు. ఒక్క అల్వాల గ్రామంలోనే 250 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులను ఆదుకునే సోయి లేదు.. ఢిల్లీలో కూర్చొని మియాపూర్‌లో 500 ఎకరాలు అమ్మి కమిషన్లు కొట్టే ఆరాటం చూపుతున్నాడని విమర్శించారు. కల్వకుర్తిలో 5 మోటార్లు 24 గంటలు నడపాలని, జూరాల నుంచి మరో 15 రోజులు నీళ్లిచ్చి పంటలను కాపాడాలని సూచించారు. ఆంధ్రాకు వరదలొస్తే పరుగెత్తుకొచ్చిన కేంద్ర బృందాలు.. తెలంగాణలో కరువు వస్తే ఎందుకు రావని ప్రశ్నించారు. రైతన్నలూ ధైర్యం కోల్పోవద్దని, అసెంబ్లీలో రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, గద్వాల బీఆర్ఎస్ ఇన్‌‌చార్జి బాసు హనుమంతు నాయుడు, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ కార్పొరేషన్ చై‌ర్మెన్లు ఇంతియాజ్, వాల్యా నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, రజినీ సాయిచంద్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్