Magazines

గరిష్టానికి 
వాణిజ్యలోటు

19 నిమిషాల క్రితం

Trade
avatar
balaji

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

అక్టోబర్‌‌లో 9 శాతం 
పెరిగిన దిగుమతులు

45 శాతం పెరిగిన ఎగుమతులు

అయినా 39.88 బిలియన్‌ డాలర్లకు లోటు


న్యూఢిల్లీ : దిగుమతులు భారీగా పెరగడంతో భారత వస్తు వాణిజ్య లోటు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరింది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో అక్టోబర్ నెలలో 39.88 బిలియన్ డాలర్ల లోటు చోటు చేసుకుంది. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన 32.25 బిలియన్ డాలర్లను మించి లోటు చోటు చేసుకోవడం ఆందోళకరం. సెప్టెంబర్‌లో 30.21 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు.. గతేడాది అక్టోబర్‌లో 33 బిలియన్ డాలర్లుగా ఉంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన నెలలో వస్తు ఎగుమతులు 11.4 శాతం పెరిగి 49.47 బిలియన్ డాలర్లకు చేరాయి. సెప్టెంబర్‌లో 44.40 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. అక్టోబర్‌ 2026లో భారత్ ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అత్యధిక నెలవారీ వస్తు ఎగుమతులను నమోదు చేసిందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు.

ఇదే సమయంలో దిగుమతులు 74.61 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 19.7 శాతం ఎగబాకి 89.35 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో వాణిజ్య లోటు మరింత పెరిగిందన్నారు.ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో తలెత్తిన అంతరాయాలు దేశ దిగుమతుల బిల్లుపై తీవ్ర ప్రభావం చూపాయి. ముడి చమురు ధరల పెరుగుదల, సుదీర్ఘమైన నౌకా రవాణా మార్గాలు, పెరిగిన సరుకు రవాణా ఛార్జీలు, యుద్ధ రిస్క్ బీమా ప్రీమియంలు దిగుమతి వ్యయాన్ని పెంచాయి. దీనివల్ల ముడి సరుకుల ధరలు పెరిగి దేశీయ ఎగుమతిదారుల లాభాలపై ఒత్తిడి నెలకొంది. అయితే.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చన్న అంచనాలతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు 92 డాలర్ల స్థాయికి దిగిరావడం కాస్త ఊరటనిచ్చే అంశం.

అంతర్జాతీయంగా ఇంధన, రవాణా వ్యయాలు అధికంగా కొనసాగితే కరెంట్ అకౌంట్‌పై ఒత్తిడి పెరగడంతో పాటు దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగబాకే ప్రమాదం ఉందని ఆర్‌‌బిఐ ఇప్పటికే హెచ్చరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వస్తు ఎగుమతుల్లో 11.6 శాతం, దిగుమతుల్లో 11.7 శాతం పెరుగుదల ఉండొచ్చని ఆర్బీఐ తన అక్టోబర్ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో అంచనా వేసింది. అలాగే కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1.2 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. పసిడి దిగుమతులు 63 శాతం పతనం భారత్ బంగారం దిగుమతులు అక్టోబర్‌లో 62.57 శాతం తగ్గి 5.51 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి అధిక ధరల వల్ల డిమాండ్‌ ‌లేమితో ఏప్రిల్‌–అక్టోబర్ మధ్య దిగుమతులు 39.9 శాతం క్షీణించి 24.78 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 18.50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్