- Advertisement -
స్కూళ్ళు
ఆకాశంలోనూ ఉంటాయి
సూర్యుడొక్కడే వేసవికాలమంతా
తండ్రిలా మండిపడుతూ
కన్నెర్రజేస్తూ తిరిగి తిరిగి
వాగుల్లో వంకల్లో
చెరువుల్లో సంద్రాల్లో
దాక్కున్న నీళ్ళపిల్లల్ని లాక్కెళ్ళి
మేఘాల హాస్టళ్ళలో
చేర్పించి మరీ వస్తాడు
హోమ్ సిక్కని అక్కడ కొన్నాళ్ళు
వానాకాలంలో నింగి బళ్ళకు
సెలవులిచ్చినట్లున్నారు
ఇంకేం…
జల బాలబాలికలు బిలబిలమంటూ
తుళ్ళుతూ గెంతుతూ
మళ్ళీ తమ నేలతల్లి ఒళ్ళోకి చేరుతున్నారు
ఇక… ఈ పిల్లకాయల సాయంతో
రైతు మహాశయుడు
ఏం మాయ చేస్తాడో గానీ
భూమిలోంచి బువ్వను తీస్తాడు
– నలిమెల భాస్కర్
- Advertisement -