– రూ.38 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయాలి :ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మలకు కేటీఆర్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి వినతిపతం అందజేశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జీల భారం పెరిగిందనీ, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్‌పీ వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించాను. 2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లపై అధికారులు రూ.19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని తెలిపారు. అది సర్‌చార్జీలతో కలిపి ఇప్పుడు రూ.38 కోట్లకు చేరిందని వివరించారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతోపాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నలను అదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, కార్మికుల ఉపాధిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలివ్వాలని సూచించారు. కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలిపారు. సిరిసిల్ల నేతన్నల సమస్య కేవలం ఒక ప్రాంతానిది కాదనీ, అది వేలాది కుటుంబాల మనుగడకు సంబంధించినదని వివరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి సానుకూలంగా స్పందించి, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



