– కమ్యూనిస్టుల ఐక్యతకు ఎనలేని కృషి : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
– ఆ మహామనిషి నిత్యం మన మధ్యే ఉంటారు : జస్టిస్ సుదర్శన్
– సురవరం ఎప్పుడూ ప్రేరణ ఇస్తూనే ఉంటారు: కూనంనేని సాంబశివరావు
– ”ప్రజలతో నా ప్రయాణం” సురవరం స్వీయచరిత్ర పుస్తకావిష్కరణ
నవతెలంగాణ-హిమాయత్ నగర్
కమ్యూనిస్టు అగ్రనేత, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు ఆదర్శప్రాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలో గొప్ప కమ్యూనిస్టు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లినప్పుడే మనం నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని తెలిపారు. సురవరం సుధాకర్‌రెడ్డి 84వ జయంతిని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సురవరం సుధాకర్ రెడ్డి స్వీయ చరిత్ర.. ”ప్రజలతో నా ప్రయాణం” అనే పుస్తకావిష్కరణ సభ జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ బి.సుదర్శన్‌తో కలిసి రాజా పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. ప్రజలతో కలిసి జీవిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపినప్పుడే పార్టీ నిజమైన ప్రజాపార్టీగా ఎదుగుతుందని సూచించారు. దేశంలో వామపక్ష బలం రోజు రోజుకూ తగ్గిపోతున్న తరుణంలో కమ్యూనిస్టు శక్తుల ఐక్యత అత్యవసరమని, ఇందుకు సురవరం సుధాకర్ రెడ్డి ఎనలేని కృషి చేశారని తెలిపారు. సుధాకర్‌రెడ్డి వ్యక్తిగత జీవితం, ఆయన రాజకీయ, సిద్ధాంతపరమైన నిబద్ధత నుంచి ప్రేరణ తీసుకుని, పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. ప్రజలతో అనుబంధాన్ని మరింత చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
జసిస్ట్ సుదర్శన్ మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి జీవితమంతా దేశం, తెలంగాణ ప్రజలతో పెనవేసుకున్న సంబంధమని, ఈ మహా మనిషి మన మధ్య భౌతికంగా లేకపోయినా నిత్యం మన మధ్యే ఉంటారన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీకి సురస్వరమన్నారు. అందరూ మరణించడం సహాజమని, అయితే ఆదర్శ, ఉత్తమ కమ్యూనిస్టు మరణిస్తే ప్రజలు ఎలా నీరాజనాలు పలుకుతారో అనేదానికి సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్ర నిదర్శనమన్నారు. సురవరం మరణించినా ఆయన ఎప్పుడూ ప్రేరణను ఇస్తూనే ఉంటారన్నారు. అయితే, ఖమ్మంలో జరిగిన పార్టీ 100 ఏండ్ల వార్సికోత్సవ బహిరంగ సభలో ఆయన భౌతికంగా లేకపోవడం కొంత లోటుగా కనిపించిందన్నారు. సీపీఐ సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా సురవరం సుధాకర్ రెడ్డి నిర్వహించిన అనేక పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యేగా తాను, నల్లగొండ ఎంపీగా సుధాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఫ్లోరైడ్‌తో సతమతమవుతున్న ఆ ప్రాంత ప్రజలకు కృష్ణా జలాలను అందించేందుకు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. బి.వి.విజయలక్ష్మి మాట్లాడుతూ.. సుధాకర్ రెడ్డి తన స్వీయ అనుభవాలను పుస్తక రూపంలో రాయాలని ముందు ఆలోచన లేకపోవడం, పార్టీ నాయకులు పుస్తకం రాయాలని ఒత్తిడి తేవడంతో చివరి దశలో మాత్రం నోట్స్ రూపంలో రాశారని తెలిపారు. దీనిని పూర్తిగా క్రోడికరించి పుస్తక రూపంలో తీసుకొచ్చామని, ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పుస్తకం వామపక్ష ఉద్యమకారులకే కాకుండా రాజకీయ నాయకులందరికీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. పుస్తకాన్ని సమీక్షిస్తున్న సమయంలో సుధాకర్‌రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
సురవరం సుధాకర్ రెడ్డి ఆదర్శప్రాయుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



