నవతెలంగాణ- హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఐదు అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి, 4 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రస్తుతం ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను తరలించేందుకు వీలుగా రాజీవ్ గాంధీ ఆస్పత్రి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఎంతమంది లోపల ఉన్నారు, ప్రాణనష్టం ఎంత అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రమాదంపై అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది.






కామెంట్‌లు (0)