నవతెలంగాణ - హైదరాబాద్ : రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఓ యాంటీ-ప్లేగు పరిశోధనా సంస్థలో పనిచేసే 28 ఏళ్ల టెక్నీషియన్ దర్యా షిపిలోవా మృతి కలకలం రేపుతోంది. ఆమెకు తీవ్రమైన న్యుమోనియా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ అక్టోబర్ 1-2 తేదీల మధ్య మృతి చెందినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్లేగు బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ ప్రమాదవశాత్తూ పగిలిన ఘటనతో ఆమె మృతికి సంబంధం ఉందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ కారణాన్ని రష్యా ఆరోగ్య అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఈ ఘటన నేపథ్యంలో ఆమెతో సంబంధం ఉన్న దాదాపు 200 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. వారిలో ఇప్పటివరకు ఎవరికీ ప్లేగు లక్షణాలు కనిపించలేదని, పరీక్షలు నెగెటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇర్కుట్స్క్ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని రష్యా ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం యెర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల ప్లేగు వ్యాధి వస్తుంది. ముఖ్యంగా న్యుమోనిక్ ప్లేగు శ్వాసకోశ కణాల ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే అవకాశం ఉంది. అయితే సకాలంలో యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే వ్యాధిని నయం చేయవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.






కామెంట్‌లు (0)