Magazines

ఢిల్లీలో బారికేడ్లు తొలగించండి, మెట్రో నడపండి : సుప్రీంకోర్టు

1 గంట క్రితం

Supreem Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన ఆంక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతలు లేదా ట్రాఫిక్ సమస్యలు ఉంటే తప్ప, మిగతా అన్ని చోట్లా ఏర్పాటు చేసిన బారికేడ్లను సమీక్షించి తొలగించాలని అధికారులను ఆదేశించింది. మెట్రో, రైల్వే సేవలను యథాతథంగా కొనసాగించాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప వాటిని నిలిపివేయరాదని నేడు జరిగిన ప్రత్యేక విచారణలో స్పష్టం చేసింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు సంబంధించిన డిమాండ్లతో నిన్న‌ ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా అధికారులు భారీ ఆంక్షలు విధించారు. పలు మెట్రో స్టేషన్లను మూసివేయడం, నిరసనకారులను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ప్రజలు, వాహనాల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతించాలని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం కాకుండా ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలిగించరాదని తేల్చి చెప్పింది. నిర్దిష్ట ప్రాంతాల్లో ఆంక్షలు విధించిన చోట మినహా, శాంతియుతంగా సమావేశమయ్యే వారిని అక్రమంగా నిర్బంధించకూడదని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే పునరుద్ధరించామని, మెట్రో కార్యకలాపాలు కూడా పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని కోర్టుకు తెలియజేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మెట్రో స్టేషన్ల మూసివేతపై వ్యక్తమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని దీనిపై మరిన్ని వివరాలు సమర్పించాలని కోరుతూ తదుపరి విచారణను మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్