నవతెలంగాణ-మర్రిగూడ
జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను శనివారం మర్రిగూడ మరియు చింతపల్లి పోలీస్ బృందం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. వారి నుండి సుమారు 11 తులాల బంగారం,1.5 కిలోల వెండి, రెండు బైక్ మరియు 5 మొబైలు ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ సుమారు 21.05 లక్షలు ఉంటుందని దేవరకొండ డిఎస్పీ ఎం వి శ్రీనివాస రావు తెలిపారు. డిఎస్పి తెలిపిన వివరాల ప్రకారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ఈ క్రమంలో శనివారం ఉదయం నాంపల్లి సర్కిల్ పరిధి లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలిసులు విచారించారు. మర్రిగూడ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 118/2026 U/s 331(3), 305 BNS మరియు చింతపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 38/2026 U/s 331(3), 305(a) బిఎన్ఎస్ కేసుల విచారణలో వారు జిల్లాలో మర్రిగూడ, చింతపల్లి, గుర్రంపోడ్, దేవరకొండ, కనగల్,నకిరేకల్ పోలీస్ స్టేషన్ ల పరిధి లో 9 చోరీ కేసులకు పాల్పడ్డారు. నిందితులు 1.బొల్లెమెనీ అంజి(29) అలియాస్ స్వామి, వనపర్తి,2.పూజా రోల్ల శివకుమార్(23) అలియాస్ శివయప్ప, హైదరాబాద్, 3. సంపంగి రాజు (30) అలియాస్ రాము, వనపర్తి, 4. గోపి అరుణ్ కుమార్ (23), మహబూబ్ నగర్ జిల్లా గా గుర్తించారు.
నిందితుల మధ్య జైల్లో పరిచయం ఏర్పడి బయటికి వచ్చి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని డిఎస్పి హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న మర్రిగూడ ఎస్ఐ బి.రాంబాబు, చింతపల్లి ఎస్ ఐ ఎమ్.రామ్మూర్తిని పోలీసు సిబ్బంది కిషన్, శరణ్, వేణుగోపాల్, అనిల్, యాదగిరి, యాదయ్య లను డీఎస్పీ రివార్డ్ తో అభినందించారు.







కామెంట్‌లు (0)