నవతెలంగాణ - హైదరాబాద్ : రైతుపై అమానవీయంగా, అనుచితంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతును కించపరిచేలా మాట్లాడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టి ఆయనను సస్పెండ్ చేశారు. గజ్వేల్ మండలం మక్త మాసన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు యేసు.. రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్‌ఆర్) భూసేకరణ పరిహారం విషయంలో తన బంధువులతో ఉన్న వివాదంపై మాట్లాడేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తో కలిసి అధికారిని కలిశారు.
ఈ క్రమంలో రైతు తన సమస్యను వివరిస్తుండగా తహసీల్దార్ అనుచితంగా స్పందించారు. “ఇంకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?” అంటూ ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే అలా అన్నారా అని అడగ్గా.. అవునంటూ సమాధానమిచ్చినట్లు వీడియోలో నమోదైంది. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి విచారణకు ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) ప్రాథమిక విచారణ జరిపి, తహసీల్దార్ ప్రవర్తన సరికాదని నివేదిక సమర్పించారు.
ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు.
కాగా, ఈ ఘటన సుమారు ఐదు నుంచి ఆరు నెలల క్రితం జరిగిందని రైతు యేసు వెల్లడించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తన భూ వివాదం పరిష్కారమై, పరిహారం డబ్బులు కూడా బ్యాంకు ఖాతాలో జమయ్యాయని ఆయన తెలిపారు. ఘటన పాతదే అయినప్పటికీ, తహసీల్దార్ ప్రవర్తనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు.







కామెంట్‌లు (0)