రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, ఫిల్మ్ రీల్ పంపిణీపై రేషన్లు, కోటాలు ఉన్నప్పటికీ 1937 – 1949 మధ్య 12 సంవత్సరాలలో తవమణి దేవి 12 సినిమాలలో నటించడం చిన్న విషయం కాదు. తవమణి దేవి నటించిన 12 సినిమాలలో కనీసం శకుంతలై, రాజకుమారి చిత్రాల నెగటివ్‌లు భద్రపరచబడ్డాయి. మిగిలిన 10 సినిమాల నెగటివ్‌లు ఏ ఫిల్మ్ ఆర్కైవ్స్‌లోనైనా అందుబాటులో ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు?
తవమణి దేవికి వరుస సినిమా విజయాల వల్ల చాలా సినిమా కాంట్రాక్టులు వచ్చాయి. అవకాశాలు వరుస కట్టాయి. వీటికి తోడు సొంతంగా ‘విజయ’ అన్న సినిమా తీసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అప్పటి నుండే ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు మొదలైనవి. తనకు సినిమా అవకాశాలు రాకుండా, దర్శక నిర్మాతలపై ‘తవమణిని కాంట్రాక్టుల నుండి తప్పించాలనే ఒత్తిడులు మొదలైనవి. ఆమె నటిస్తే, ఆ సినిమాను విడుదల చేయనివ్వం చేసినా ఆడనివ్వం’ అని బెదిరింపులతో ఒక నటుడు, ఇద్దరు స్క్రిప్ట్ రచయితలు ఆమెను మద్రాసు నుండి తరిమేయాలని కక్ష కట్టారు. దీంతో ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలందరూ ఇబ్బందులు పడ్డారు. కొందరు రద్దు చేసుకున్నారు. ఇలాంటి వ్యతిరేకతకు కారణం కూడా ఉంది. కొంతమంది నిర్మాతలు, దర్శకులకు నటీమణులు కేవలం నటిస్తే సరిపోదు. వారు ప్రతి కోరికను తీర్చాలి. కానీ, ఆమె కేవలం గౌరవనీయమైన సంస్థలు సినిమాలలో మాత్రమే నటించేది. ఒక నిర్మాత ఆమెకు ఖరీదైన రాళ్లతో చేసిన గాజులు ఇచ్చి తన కోరికను తీర్చమని ఆమెను చూసి వెకిలిగా నవ్వాడు. ”నాకు మీరు ఇచ్చిన పారితోషికమే చాలు. ఇలాంటివి ఏమీ వద్దు” అని సున్నితంగానే ఆయన కోరికను తిరస్కరించేది. మరో నిర్మాత, షూటింగ్ మధ్యలో ”ఏకాంతంలో మాట్లాడటానికి రమ్మనే” వాడు.
ఎందుకు ‘మీకు కావాలంటే, ఇక్కడే ఇప్పుడే మాట్లాడవచ్చు కదా?’ అని చమత్కారంగా తిప్పికొట్టేది. ఆమె గౌరవంగా జీవించాలనుకుంది. కానీ, వారు చెప్పినట్టుగా ఆమె తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. దాంతో వారి దుర్మార్గపు పన్నాగాల వల్ల చాలా అవకాశాలను కోల్పోయింది. అంతేగాక సొంత సినిమాకు ఫైనాన్సర్లు రాలేదు. ఈ మధ్యకాలంలో తండ్రిని కూడా కోల్పోయిన ఆమె ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక సిలోన్‌కు తిరిగి వెళ్లాలనుకున్నా వెళ్లలేకపోయింది. రోజులు గడపటానికి తన కారు, నగలు అమ్ముకోవలసి వచ్చింది. ”నేను నత్య, సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా, దానికి కూడా వ్యతిరేకత ఎదురైంది. తిరుచ్చి తేవర్ హాల్‌లో తన కార్యక్రమం జరగకుండా నిరసన తెలిపారు” అని ఒక ఇంటర్వ్యూలో వాపోయారామె. ఇలా పలు రకాల, బాధలు ఎదుర్కొన్నది. చెన్నైలో అద్దె ఇంట్లో నివసించేది. రాత్రిపూట, పెరట్లో ఆమెను బెదిరించడానికి ఎముకలు విసిరేవారు. ఇంకా ఇంటి పరిసరాలలోకి క్షుద్రపూజ వస్తువులు విసిరారు. ఇలా అన్ని వైపుల నుండి ఆమెపై ఒక ‘నీడ యుద్ధం’ జరిగింది. అయినా, పదేళ్ళు ఆస్తులు అమ్ముకుంటూ జీవించింది. ఆమెకు ఎదురైన ఇబ్బందుల కారణంగా సొంత చిత్రం ‘విజయ’ అసంపూర్తిగా మిగిలిపోయింది.

చివరికి మానసిక శాంతి కోసం రామేశ్వరం వెళ్ళింది. రామేశ్వరంలో ఒక ఆశ్రమంలో ఉండి ఆధ్యాత్మిక చింతనలో మునిగి పోయింది. ప్రతిరోజూ గుడికి వెళ్ళేది. అక్కడ కోడిలింగ శాస్త్రి అనే పూజారి ఆమెకు ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. కోడిలింగ శాస్త్రికి అంతకు ముందే వివాహమై, భార్యను కోల్పోయాడు. ఇద్దరు పిల్లలు. ఈమె కష్టాల గురించి తెలుసుకున్న తర్వాత, శాస్త్రి మావయ్య తన మేనల్లుడికి ఆమె పెళ్లి చేయాలనుకున్నారు. తన సమ్మతిని కోరగా ఆమె అంగీకరించింది. 1962 నవంబర్‌లో శాస్త్రితో తవమణి దేవి వివాహం జరిగింది. ఆ తర్వాత సినిమా జ్ఞాపకాలను గతానికి వదిలేసి ఒక సన్యాసిని లాగ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపిందామె.
నేటికి 90 సంవత్సరాలు గడిచినా, ఇప్పటివరకు ఈలం మూలానికి చెందిన ఏ సినీ కళాకారిణి కూడా 1937 నుండి 1940ల చివరి వరకు పదేళ్లకు పైగా సేలం, చెన్నైలో తవమణి దేవి చిత్రాలు సాధించినంత విజయాన్ని సాధించలేదు. సమాన స్థాయిలో కాకపోయినా, కర్ణాటక సంగీత దిగ్గజాలైన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి శకుంతలై (1940) చిత్రంలో ఆమెకు గుర్తించదగిన పాత్ర లభించింది. 1941లో ‘సీతా జననం’ చిత్రంలో ఒక చిన్న పాత్రకు ఎంజీఆర్‌కు కేవలం 25 రూపాయలు చెల్లిస్తున్నప్పుడు, సీత పాత్రలో కథానాయికగా నటించిన తవమణి దేవికి పదివేల రూపాయలలో పారితోషికం ఇచ్చారని ఎవరు ఊహించగలరు? అంతేకాకుండా, ‘రాజకుమారి’ (1947) చిత్రంలో ఎంజీఆర్‌కు కథానాయకుడిగా మొదటి అవకాశం వచ్చినప్పుడు, ఆమె తనకంటూ ఒక పెద్ద తారగా వెలుగొందుతున్నారు. తవమణి దేవి నిజంగా ఒక అసలైన ప్రతిభావంతురాలు, నీతిమాలిన వ్యవహారాలకు పేరుగాంచిన పరిశ్రమలో మహిళల పట్ల మర్యాద, సమానత్వం కోసం నిలబడ్డారు. ఈ రోజుకీ మహిళల పట్ల వివక్ష చూపే పరిశ్రమలో వేధింపులకు ఎదురు నిలబడి, సమానత్వాన్ని డిమాండ్ చేసి దానిని సాధించడంలో తన కాలానికి చాలా ముందున్న నటి తవమణి దేవి.
చివరగా ఒక మాట – 1992లో తవమణి దేవి పరిశ్రమలోని చీకటి కోణాన్ని బహిర్గతం చేయడంలో చూపిన తెగువ అనితర సాధ్యం. అయితే, పరిశ్రమలో టి.ఆర్. సుందరం వంటి క్రమశిక్షణ కలిగిన నిర్మాతలు, నిజాయితీ కలిగిన కవి కన్నదాసన్‌ను ఆమె గొప్పగా గౌరవిస్తారు. చివరి రోజుల్లో తవమణి దేవి సినిమా జ్ఞాపకాలను, గతాన్ని వదిలేసి దూరంగా, ఆనందంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపింది. 2001 ఫిబ్రవరి 10న తన 76వ ఏట ఆమె కన్నుమూసింది. తమిళ సినీ చరిత్రలో ఆమెది ఒక ప్రత్యేక అధ్యాయం. సినీ రంగంలో తొలి నాట స్త్రీల పట్ల జరిగే వేధింపులు, కక్ష సాధింపులకు ఆమె ఒక చారిత్రక ఉదాహరణ. ఎన్ని వేధింపులు ఎదురైనా ఆమె ధిక్కార స్వరం తోనే వాటిని ఎదుర్కోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి నిదర్శనం.
తమిళ సినీ ‘వన మోహిని’
1941లో తవమణి దేవి నటించిన ‘వన మోహిని’ చిత్రం భారతీయ సినిమా ప్రపంచంలో గొప్ప సంచలనాన్ని సష్టించింది. కారణం, దీనిని టార్జాన్ తరహాలో అడవిలో చిత్రీకరించారు. ఆమె అడవిలో చేసిన సాహసాలు, పోరాటాలు, యాక్షన్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చాయి. ఆ సినిమా కోసం ఆమె ధరించిన రెండు ముక్కల దుస్తులు లక్షలాది మంది దష్టిని ఆకర్షించినవి. వన మోహిని చిత్రం గ్రాండ్ సక్సెస్ అయినప్పుడు ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు’.
భారతీయ సినిమా చరిత్రలో తొలుదొలుత ‘చంద్రు’ అనే ఏనుగు అత్యధిక ప్రశంసలు పొంది1941లో హిట్ అయిన చిత్రం ‘వన మోహిని’. ఈ చిత్రం హీరోయిన్ తవమణి దేవికి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. హాలీవుడ్ నటి డోరతీ లామౌర్ నటించిన హాలీవుడ్ ‘హర్ జంగిల్ లవ్’ (1938), చిత్రానికి పునః రూపకల్పన ‘వన మోహిని’. తవమణి అదే వేషధారణ, హవాయి-శైలి సారంగ్‌ను ధరించింది. సినిమాలో ఇటువంటి దుస్తులను ధరించడం ఇదే మొదటిసారి. లామౌర్ సినిమా నుండి ప్రేరణ పొంది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసినవాడు ప్రముఖ హిందీ సినీ నటుడు భగవాన్. ఈయన ఆ తర్వాత 1950ల్లో నాటి సంగీత హిందీ చిత్రం ‘అల్బేలా’ నిర్మాత, హీరోగా ప్రసిద్ధుడు. తవమణితో పాటు, ఇందులో ఎం.కె. రాధా (జెమిని వారి ‘మాగమ్ ఓపస్’, చంద్రలేఖ హీరో), ‘చంద్రు’ అనే ఏనుగు నటించారు. ఇంకా హాస్యనటుడు’ అంబి, టి.వి. కష్ణస్వామి, కమలా బాయి, కె. టి. సక్కు బాయి, కష్ణ బాయి, ఎస్. బాషా, ఎస్. ఆర్. కె. అయ్యంగార్, ఎన్. అప్పు నటించారు.
ఎన్. విశ్వనాథ అయ్యర్ ఈ చిత్ర నిర్మాత. అతను ట్రావెన్కోర్ దట్టమైన అడవులలో ఈ ఏనుగును చూసి దానిని దాదాపు దొంగిలించి తెచ్చి షూటింగ్ చేశారు. తవమణి దేవి దానిపై కూర్చుని అడవుల్లో తిరిగినప్పుడు దక్షిణ భారత మహిళా టార్జాన్‌గా ప్రేక్షకుల హర్షమోదాలు పొందింది.
తవమణి, రాధా, ‘చంద్రు’ లతో పాటు, సంగీతం వన మోహినిలో మరొక ప్రధాన ప్లస్ పాయింట్. ఈ చిత్రంలో 10 పాటలు ఉన్నాయి. తవమణి వాటిలో అత్యధికంగా పాడింది. వాటిలో ఒకటైన ‘అరియాతే ఎన్ మనం’ పెద్ద హిట్ అయింది. సంగీత స్వరకర్త రామ్ చితల్కర్, (సి. రామచంద్ర).
వన మోహిని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించి తవమణి కీర్తి మరింత పెరిగింది. అది మొదలు ఆమె తన దుస్తులను ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవాలని, మేకప్ చేసుకోవాలని నిర్మాతలకు షరతులు పెట్టడం చేసింది. ఆ సమయంలో భారతీయ సినిమాలో ఇది విననిది.
కథ అంతా ఒక గిరిజన మహిళ గురించి, ఆమె తోడుగా ఏనుగు మాత్రమే ఉంటుంది. ఒక దుష్ట వ్యక్తి ఆమెను బంధించడానికి బయలుదేరాడు. ఒక యువరాజు (రాధ) తన తప్పిపోయిన మామను వెతకడానికి అడవికి వచ్చి తవమణిని కలుస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడి విలన్ చేత బంధించబడతారు. హీరో ఏనుగు సహాయంతో విలన్‌ను నాశనం చేసి, తన మామను కనుగొని ఆమెను ఎలా వివాహం చేసుకుంటాడు అనేది మిగిలిన కథ.
తవమణి అందాల నటన, శ్రావ్యమైన సంగీతం, హదయాన్ని కదిలించే ఏనుగు చంద్రుని అలనాటి సినిమా ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకున్నారు. 1957లో, సేలంకు చెందిన సినీ దిగ్గజం టి.ఆర్. సుందరం దీనిని సింహళంలో వన మోహినిగా పునర్నిర్మించారు. దీనికి ఎ.బి. రాజ్‌తో కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. వనమోహిని సినిమా తర్వాతనే తమిళ సినిమా రచయితలు తమ సినిమా కథల రూపకల్పన విధానాన్ని మార్చుకున్నారని ప్రఖ్యాత తమిళ సినీ చరిత్రకారుడు రాండర్ గై ఒక సందర్భంలో రాశాడు.
(వ్యాసకర్త సినీ చరిత్ర పరిశోధకులు)
– హెచ్ రమేష్ బాబు, 7780736386



