ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి పలు డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించిన ఇరాన్
టెహ్రాన్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నది ఓ సామెత. ఇజ్రాయిల్-అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరిగా తయారైంది. ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈపై ఇరాన్ 1,714 డ్రోన్లు, 334 బాలిస్టిక్ క్షిపణులు, 13 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులలో అనేక హోటళ్లు, రిఫైనరీలు, విమానాశ్రయాలు, వాణిజ్య మండలులు దెబ్బతిన్నాయి. యూఏఈనే ఇరాన్ ఎందుకు లక్ష్యంగా ఎంచుకుంది? అక్కడ అమెరికా తన సైనిక కేంద్రాలను నిర్వహించడమే దీనికి కారణమా? ఈ ప్రశ్నలకు సమాధానం కొంత క్లిష్టంగానే ఉంటుంది. యూఏఈతో అమెరికాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారీగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. ఇతర భాగస్వాముల కంటే ఉదారంగా స్పందించిన దేశం యూఏఈయే.
శ్వేతసౌధం అందించిన వివరాల ప్రకారం…అమెరికాలో పది సంవత్సరాల కాలంలో 1.4 ట్రిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానని యూఏఈ హామీ ఇచ్చింది. అమెరికాకు అందిన మొత్తం హామీలలో ఇది 27 శాతం. ఖతార్, జపాన్, సౌదీ అరేబియా, భారత్, దక్షిణ కొరియా, బహ్‌రైన్, ఐర్లాండ్ కూడా అమెరికాలో పెట్టుబడులు పెడతామని తెలిపాయి. ట్రంప్ పొందే విదేశీ పెట్టుబడులలో 62 శాతం అరబ్ దేశాల నుంచి వచ్చేవే. యూఏఈని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడానికి ఈ పెట్టుబడులు ఒక్కటే కారణం కావు. అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా యూఏఈ ఆవిర్భవించడం కూడా కారణమే. గత దశాబ్ద కాలంలో యూఏఈలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా వెయ్యికి పైగా వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలలో వంద శాతం విదేశీ యాజమాన్యాన్ని దుబాయి ప్రభుత్వం అనుమతించిన తర్వాత ఈ పెట్టుబడులు బాగా వచ్చాయి.
ప్రపంచబ్యాంక్ డేటా ప్రకారం…యూఏఈలోకి 2018లో 10.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా 2021 నాటికి అవి దాదాపుగా రెట్టింపై 20.7 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024లో అవి రెట్టింపు కంటే ఎక్కువై 45.6 బిలియన్ డాలర్లు అయ్యాయి. 2024లో పశ్చిమాసియాలోకి వచ్చిన పెట్టుబడులలో ఒక్క యూఏఈ వాటానే 56 శాతం. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు దుబాయి నగరంలోనే ఉన్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ వంటి మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థలు రాజకీయంగా స్థిరంగా ఉన్నాయి. అక్కడ పెట్టే పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా యూఏఈ పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన దేశంగా నిలిచింది. యూఏఈని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అమెరికాపై నేరుగా దాడి చేయకుండానే దాని ప్రధాన ఆర్థిక భాగస్వామిని ఇరాన్ దెబ్బతీస్తోంది. యుద్ధభూమికి దూరంగా ఉన్న అమెరికా ఆర్థిక ప్రయోజనాలపై సైతం దాడి చేయగలనన్న సంకేతాన్ని పంపుతోంది. యూఏఈపై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకం సడలిపోయేలా చేయడం కూడా ఇరాన్ వ్యూహంలో భాగమే. ఎందుకంటే యూఏఈపై ఇరాన్ చేసే ప్రతి దాడీ దాని ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది.
షార్జా సమీపంలో నౌకపై దాడి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన షార్జాకు ఉత్తరంగా పదిహేను నాటికన్ మైళ్ల దూరంలో ఓ నౌకపై దాడి జరిగింది. ఈ దాడి నుంచి నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని యునైటెడ్ కింగ్‌డమ్ మారీటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ (యూకేఎంటీఓ) ఆదివారం తెలిపింది. ఈ దాడి లక్ష్యమేమిటో తెలియదని, దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారని చెప్పింది.



