యాసంగి పంటలు అరిగొస పడుతున్నాయి. సాగునీరు లేక నేలలు నెర్రెలు బాస్తున్నాయి. జలం కోసం నోళ్లు తెరుస్తున్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నా ప్రయోజనం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. వ్యవసాయశాఖ అధికారులు సీజన్ కంటే ముందే ‘తైబంధీ’ చేసుంటే ఈ సమస్య వచ్చేదే కాదని వ్యవసాయ, సాగునీటిరంగ నిపుణుల అభిప్రాయం. ఎండలు పెరుగుతున్నందున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలెండి పోవడం, సాగునీరు లేక పశవులకు మేతవుతున్న దుస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో 63 శాతం మేర వర్షాధారిత పంటలే. 2026 యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 56 లక్షల ఎకరాల మేర పంటలేయగా ఫిబ్రవరి వరకు సాగు పూర్తవుతుంది. రెండు పంటలు వరివేయడంతో భూమినుంచి నీరు బయటకు వస్తున్నది. దీంతో ఊట వలన దిగుబడి తగ్గుతున్నది. ఎకరానికి నలభై బస్తాల ధాన్యం దిగుమతి రావాల్సింది ఇరవైఏడు బస్తాలకు తగ్గుతున్నది. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా చేతికందడం లేదు.
ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖ యాసంగి సీజన్ అవగాహనా కార్యక్రమాలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా తయారైంది. రాష్ట్ర వ్యవసాయ ప్రణాళికను రూపొందించాల్సి ఉండగా, అదీ ఉందో లేదో కూడా తెలియదు. భూసార పరీక్షలు చేసి ఏ భూముల్లో ఏయే పంటలు వేయాలో వివరంగా రైతులకు తెలియజేయాలి. ప్రతి రైతుకు మూడేండ్లు ఉనికిలో ఉండే ‘సాయిల్ హెల్త్ కార్డు’ ఇవ్వాలి. ఎందుకంటే, ఎరువుల సిఫారసులు, తక్కువ సాగు ఖర్చు, పంటల దిగుబడిని పెంచడం, అధిక ఎరువులను నివారించడం తదితర ప్రయోజనాలను ఈకార్డు ద్వారా రైతులకు కల్పిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర అవసరాల మేరకు పంటలను వేయడంతోపాటు వాతావరణానికి అనుకూలంగా పంటల విధానాన్ని మార్చాలి. వానాకాలం వరివేసిన ప్రాంతాల్లో లోతట్టు భూముల మినహా మిగిలిన భూముల్లోగానీ, బావుల కింద గానీ మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు, పప్పుదాన్యాలు, జనుము, కూరగాయలు తదితర మెట్టపంటలు వేయాలి. తద్వారా భూముల సహజ లక్షణం దెబ్బతినకుండా ఉంటుందని శాస్త్రీయ అంచనా.
పంజాబ్‌లో వానాకాలం వరివేసి యాసంగిలో గోధుమ పంట వేస్తున్నారు గతంలో నిరంతరం వరిపంట వేయడంతో వాటర్ లాగింగ్ ఏర్పడి ఎనిమిది లక్షల ఎకరాల్లో నాలుగేండ్ల వరకు పంటలే పండలేదు. తెలంగాణలో పంటల మార్పిడికి ప్రాధాన్యమివ్వక పోతే అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశముంది! కాగా జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహిసీల్దార్లు కలిసి స్థానికంగా తమ పరిధిలోని పంట పొలాలను తనిఖీ చేసి ‘తైబంధి’ చేయాలి. సీజన్ల ప్రకారం సాగు ఎంత చేయాలి, ఏయే పంటలు వేయాలనే విషయాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలి. 2014 ముందు ఇదంతా జరిగేదని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్న మాట. 2014 తర్వాత అది ఇష్టానుసారం జరుగుతున్నది. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం, రైతులు తమకు నచ్చిన పంటలేయడం, ఎండిపోవడం సర్వసాధారణమైంది. అసలు పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనే విషయమై శాస్త్రీయ అవగాహన పెద్దగా లేకపోవడంతో ఈ పరిస్థితికి కారణం. ఇదంతా నాణానికి ఒకవైపు, మరోవైపు రిజర్వాయర్లల్లో నీరున్నా కాలువలకు సాగునీటిని విడుదల చేయడం లేదు. దీంతో వేలాది ఎకరాల వరిపొలాలు పొట్టదశలోనే ఎండి పోతున్నాయి.
జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నీటి విడుదల ఆపేయడంతో బయ్యన్నవాగు రిజర్వాయర్ కింద సాగునీరు లేక తీవ్ర కటకటగా ఉంది. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా పొలాలను తడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు పశువుల మేతకు వదిలేశారు ఈ పరిణామాలు దిగుబడులపై ప్రభావం చూపనున్నాయి. మరో రెండు వారాలు నీరందితే పంటదక్కేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు, కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. సాగునీటి సమస్యపై ఆయా జిల్లాల్లో ధర్నాలు, ఆందోళనలు నడుస్తున్నాయి. ఇటు సాగునీరు విడుదల కాక, అటు బోర్లు ఎండిపోయి పంటపొలాలు ఎడారిలా మారే పరిస్థితి ఉంది.
సాగునీటి సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా లేదు. ఇది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, అందుకే రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాగునీరు లేక ఓవైపు రైతులు అష్టకష్టాలు పడుతుంటే, మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం కొత్త నష్టాలను తెచ్చిపెడుతున్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరత దేశాన్ని కుదిపేస్తుంటే, తాజాగా ఎరువుల సంక్షోభం ముంచుకొస్తున్నది. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చేందకు ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేసింది. దీనిమూలంగా ఎరువుల దిగుమతి ఆగిపోయింది. ఈ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో రైతుల బతుకు అగమ్య గోచరంగా మారింది.
పంటలెండుతున్నాయి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



