సగటున 325 గ్రాములు
కూరగాయలు తినాలి కానీ 75 గ్రాములకే పరిమితం
దెబ్బతింటున్న ఆహార సమతుల్యత
మన పంటలు టమాట, వంకాయ, దోసకాయ, క్యాబేజీ
మిగతా కూరగాయల ఉత్పత్తిలో లోటు
రాష్ట్రావసరానికి కావల్సింది 41.75 లక్షల టన్నులు… ఉత్పత్తి 23.46 లక్షల టన్నులే..
దేశంలో కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రానిది 15వ స్థానం
దిగుమతులే ఆధారం పట్టింపులేని వ్యవసాయ, ఉద్యాన శాఖలు
గుడిగ రఘు
మనం తీసుకునే ఆహారం(భోజనం)లో ఆకుకూరలు, కూరగాయల వినియోగం తగ్గుతోంది. ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన ఆహారం అందకపోవడంతో ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటున్నది. ఇప్పటికీ అనేక కుటుంబాలు ఒకే కూరతో సరిపెట్టుకుంటున్నాయి. పచ్చడి మెతుకులు, చారుతోనే పూట గడిపేస్తున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని వింటాం. కానీ ఆ ఉల్లిపాయలు మనిషికి సరిపడినంత అందడం లేదు. కొన్ని సార్లు అసలే దొరకట్లేదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) లెక్కల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 325 గ్రాముల ఆకుకూరలు, కూరగాయలు ఆహారంతో కలిపి తీసుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 75 గ్రాములకు మించి తీసుకోవడం లేదు. అయితే క్రమేణా ఈ పరిమాణం కూడా తగ్గుతూ వస్తున్నది. ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవడం ద్వారానే ఆరోగ్యం పదిలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. సరిపడా ఉత్పత్తి లేకపోవడం, దిగుమతులపై ఆధారపడటం, కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కంచంలోకి సరిపడా కూరగాయలు చేరడం లేదు. ఉన్నంతలో సరిపెట్టుకుందామనుకునే కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. కూరల్లో ఉండాల్సిన బెండకాయ, బీరకాయ, పొట్లకాయ, బీన్స్, క్యాప్సికం, ఆనపకాయల్ని సరిపడినంత పండించలేకపోతున్నాం. పచ్చిమిర్చి ధర ఎప్పుడూ ఘాటుగానే ఉంటుంది. ఆలుగడ్డ, చామగడ్డ, మొరంగడ్డ వారంలో ఒక్కసారైనా తీసుకోవాలి కానీ అవి పండించడంలో మన రాష్ట్రం వెనుకబడింది. కూరల్లో అత్యధికంగా టమాట వినియోగిస్తున్నారు. కానీ బీరకాయ, బెండకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయల్ని ధరల్ని బట్టి కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో మన అవసరాలకు కావాల్సిన దాని కంటే టమాట, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోసకాయ, క్యారెట్, ముల్లంగి వంటి కూరగాయలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో సారవంతమైన నేలలు, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండే నేలలు, సమశీతోష్ణస్థితి వంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సాంప్రదాయ కాయగూరలతో పాటు డిమాండ్ ఉన్న కూరల్ని కూడా రైతులు పండించాల్సి ఉంటుంది. అయితే వాటి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఏ చిన్న ప్రకృతి విపత్తు వచ్చినా ధరలు అమాంతం పెరగడం లేదా దిగుబడి ఎక్కువై ధరలు పడిపోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. దీనివల్ల వినియోగదారులు కూడా ఆచితూచి కూరల్ని కొనుగోలు చేస్తుంటారు.
దిగుబడిపైనే ఆధారం కావల్సింది కొండంత…సాగు గోరంత
రాష్ట్రావసరాలకు ఏటా 41.75 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. కానీ స్థానిక ఉత్పత్తి మాత్రం 23.46 లక్షల టన్నులే. ఇంకా 18.29 లక్షల టన్నులు కూరగాయల్ని వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ లోటును భర్తీ చేయడంలో వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఘోరంగా విఫలం చెందుతున్నాయి. కూరగాయల సాగుకు సంబంధించిన ప్రణాళికలు, ప్రోత్సహకాలను రైతులకు ఇవ్వట్లేదు. పంటల కాలనీలు అంటూ బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో హడావుడి చేశారు. 2013-14లో రాష్ట్రంలో 5.46 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. గడచిన పదేండ్ల కాలంలో ఆ పంటలను ప్రోత్సహించకపోవడంతో 80 శాతానికి సాగు పడిపోయింది. కూరగాయలు సాగుచేస్తున్న రైతులకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక భరోసా కల్పించలేదు. దీనితో రైతులు వాణిజ్య పంటల సాగు వైపు మళ్ళుతున్నారు. ఉల్లిపాయలతోసహా ఆకుకూరలు, ఇతరాలను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, యూపీ, బీహార్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మరో 90 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెంచితేగానీ రాష్ట్రానికి కావాల్సిన కూరగాయల ఉత్పత్తి సాధ్యం కాదు. అధిక ఉత్పత్తిని నిల్వ చేసుకోవడానికి సౌకర్యాలు లేకపోవడం, సరఫరా ఉన్నా, డిమాండ్ లేకపోవడం వంటి అనేక కారణాలతో కూరగాయల సాగుకు రైతులు ఆసక్తి చూపట్లేదు.
కారణాలెన్నో …
రాష్ట్రంలో కూరగాయల సాగు తగ్గడానికి కారణాలు అనేకం. పట్టణ ప్రాంతాల చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లు అయ్యాయి. రైతులు కూరగాయలను గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు తీసుకొచ్చే క్రమంలో రవాణా చార్జీలు తడిసిమోపడవుతున్నాయి. దీనితో చేసిన కష్టానికి ఫలితం ఉండట్లేదు. ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మధ్య దళారుల వ్యవస్థ ధరలను డామినేట్ చేస్తుంది. దీంతో రైతు సరుకులు అమ్ముడు పోక, వెనక్కి తీసుకుపోలేక, అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముకుని పోతున్నారు. లేకుంటే అక్కడే పారబోసి పోతున్నారు. డిమాండ్, సరఫరాలో పెరుగుతున్న అంతరాలే దీనికి ప్రధాన కారణం. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత వ్యవసాయ, ఉద్యాన శాఖలపై ఉన్నాయి. కూరగాయలు నిల్వ చేసేందుకు కోల్ట్‌స్టోరేజీలు లేవు. వ్యవసాయ శాఖకు మార్కెట్లపై నియంత్రణ లేకపోవడం ప్రధాన అవరోధంగా ఉంది. కూరగాయల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయట్లేదు. దీనితో రైతులు వాటిని అధిక ధరలకు కొని సాగు చేయాల్సి వస్తుంది. మార్కెట్ రిస్క్‌ను భరించే ఆర్థిక స్థోమత, తక్షణ అమ్మకాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వాలు సకాలంలో సరైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలపై కూరగాయల ధరల భారాన్ని తగ్గించి, రైతులకు గిట్టుబాటు
ధర లభించేలా చర్యలు తీసుకోవాలి.
కంచంలో కూర తగ్గుతోంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES