Tuesday, November 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆగని అన్నార్తుల ఆర్తనాదాలు

ఆగని అన్నార్తుల ఆర్తనాదాలు

- Advertisement -

గాజాను పట్టిపీడిస్తున్న ఆహార కొరత
గాజా :
ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ జరిగి ఆరు వారాలు గడిచినప్పటికీ గాజాలో అన్నార్తుల ఆర్తనాదాలు ఆగడం లేదు. ఆహారం కోసం అలమటిస్తున్న పాలస్తీనీయుల కోసం గాజాలో ఏర్పాటు చేసిన వంటశాలలు నిత్యావసరాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వంటశాలలు ఆహారాన్ని మాత్రమే తయారు చేయడం లేదు. అవి ప్రజల ప్రాణాలు నిలబెడుతున్నాయి. సెంట్రల్‌ గాజాలోని జవేడాలో అమెరికన్‌ నియర్‌ రెఫ్యుజీ ఎయిడ్‌ (అనేరా) అనే సంస్థ కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన ఈ మానవతా సంస్థకు గాజా స్ట్రిప్‌కు దక్షిణాన ఉన్న అల్‌-మవాసీలో కూడా మరో వంటశాల ఉంది. కాల్పుల విరమణ తర్వాత ఈ వంటశాలలు తమ ఆకలిని తీరుస్తాయని పాలస్తీనీయులు ఎంతగానో సంతోషించారు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. గాజాలోకి ప్రవేశిస్తున్న సహాయ సామగ్రిపై ఇజ్రాయిల్‌ సేనలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాలు సరిగా సరఫరా కాకపోవడంతో వాటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంత మెరుగుపడుతున్నప్పటికీ ఇంకా ప్రజావసరాలు పూర్తిగా తీరడం లేదు.

అనేరా నిర్వహిస్తున్న వంటశాలలో ప్రతి రోజూ ఇరవై వేల మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. గతంలో పదిహేను పాత్రల్లో ఆహారాన్ని సరఫరా చేసేవారమని, ఇప్పుడు ఆ సంఖ్యను 120కి పెంచామని నిర్వాహకులు తెలిపారు. మొత్తంగా 30 నిర్వాసితుల శిబిరాలకు ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. అయితే మరింత మెరుగైన ఆహారాన్ని అందజేయడానికి అవసరమైన కీలక ముడి పదార్థాల కొరత తమను వేధిస్తోందని అన్నారు. ప్రస్తుతానికి బియ్యం, పాస్తా, పప్పులు మాత్రమే ఇస్తున్నామని, కూరగాయలు దొరకడం లేదని తెలిపారు. కూరగాయలు దొరికితే ఆహార పదార్థాలు రుచికరంగా ఉంటాయని, పోషకాలు కూడా లభిస్తాయని చెప్పారు. తాజా కూరగాయలతో పాటు అత్యవసర ప్రొటీన్‌ను అందించే మాంసం కూడా అవసరమున్నదని వివరించారు. అయితే వీటిని గాజాలోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం దుకాణాల యజమానులు మాంసం వంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. అయితే వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో సహాయ సంస్థలు వాటిని కొనలేక పోతున్నాయి. వంటశాలల్లో ఆహార పదార్థాలతో పాటు ఇతర అవసరాల కొరత కూడా కన్పిస్తోంది. గాజాలో వివిధ వ్యవస్థల ద్వారా ప్రతి రోజూ 14 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నామని ఐరాస గత వారం తెలియజేసింది. గాజా స్ట్రిప్‌లో ఇరవై లక్షల మందికి పైగా నివసిస్తున్నారు. యుద్ధం కారణంగా ఉత్తర గాజాకు వలస పోయిన వారు ప్రస్తుతం స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే వారికి అక్కడ ఏమీ మిగలలేదు. ఆవాసాలన్నీ నేలమట్టమయ్యాయి. అయిన వారు ప్రాణాలు కోల్పోయారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇలాంటి వారందరినీ వంటశాలలు కొంతమేర ఆదుకుంటున్నాయి. ఆహారం, రొట్టె, తాగునీరు అందిస్తూ ప్రాణాలు నిలబెడుతున్నాయి.

కొందరైతే గుడారాలను అద్దెకు తీసుకొని వాటిలో కాలక్షేపం చేస్తున్నారు. గాజాలోని నాలుగో వంతు కుటుంబాలు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ అర్థాకలితో అలమటిస్తున్నాయని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం నివేదికలు చెబుతున్నాయి. అధిక ధరలకు ఆహార పదార్థాలు కొనుగోలు చేయడం కష్టంగా ఉన్నదని మూడింట రెండు వంతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని సర్వేల ద్వారా తెలుస్తోంది. ప్రజల చేతిలో డబ్బు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు తీవ్రమైన చలి కారణంగా ప్రజలు వణికిపో తున్నారు. తినడానికి తిండే కాదు… కట్టుకోవడానికి, కప్పుకోవడానికి సరైన బట్టలు కూడా లేని పరిస్థితి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల స్థితి దుర్భరంగా ఉంది. గాజా శాంతి ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి ఆమోదం లభించడంతో ఏం జరుగుతుందోనని పాలస్తీనియన్లు ఆశతో ఎదురు చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -