Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.20వేల వేతన హామీ అమలు చేయాలి

రూ.20వేల వేతన హామీ అమలు చేయాలి

- Advertisement -

మేనిఫెస్టోలోని అంశాలను నెరవేర్చండి : ‘ఐకేపీ విఓఏ’ల మహాధర్నాలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఐకేపీ వీఓఏలకు రూ.20 వేల వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షులు రాజ్‌ కుమార్‌ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌ వద్ద మహాధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన భాస్కర్‌ మాట్లాడుతూ…రూ.20 వేల వేతనంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో హామీనిచ్చారని గుర్తు చేశారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 18 వేల ఐకెపి వీఓఏ కుటుంబాలు, వారి వెన్నంటి నిలిచిన వారు కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారని తెలిపారు. ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్‌లో ఐకేపీ విఓఏ ఉద్యోగులు కోరుతున్నవి చిన్న కోరికలేనని భాస్కర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ ప్రజా సేవ మరిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వందల కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తూ, నిజమైన ప్రజాసేవ చేస్తున్న వారిని విస్మరించడం తగదని హితవు పలికారు. వేతనాలు పెంచితే సంవత్సరానికి కేవలం రూ.432 కోట్లు సరిపోతాయని తెలిపారు. ప్రస్తుతం వారికి సెర్ప్‌ నుంచి రూ.5 వేలు ఇస్తూ, మరో రూ.3 వేలు ఎస్‌హెచ్‌జీల నుంచి తీసుకోవాలని నిర్ణయించారని, అయితే గ్రామ సంఘాల వద్ద నిధుల్లేక అది అమలు కావడం లేదని తెలిపారు. పోరాటాలతోనే ఫలితాలు వస్తాయని కార్మికులకు సూచించారు. పైరవీలతో పనులు కావని, అలా చెబుతూ దారి తప్పించే వారి పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రెండేండ్లు ఓపిక పట్టామనీ, ఇక రకరకాల రూపాల్లో పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే సమ్మెకు సిద్ధపడాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడుతూ ప్రపంచవ్యాపంగా అందాల భామలను పిలిపించి వారికి బంగారం నజరానాగా అందించిన రాష్ట్ర సర్కారుకు వికేపీ విఓఏ ఉద్యోగులకు రూ.20 వేల వేతనం ఇచ్చేందుకు డబ్బుల్లేవా? అని ప్రశ్నించారు. ఫుట్‌బాల్‌ ఆట ఆడేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేసిన రేవంత్‌ రెడ్డి సర్కార్‌కు ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చేందుకు నిధుల్లేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ ధర్నాకు స్వాగతం పలుకుతూ, అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినా వాటన్నింటిని చేధించుకుని ఉద్యోగులు ధర్నా నిర్వహించారని తెలిపారు. యూనియన్‌ అధ్యక్షుడు కె.రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.పద్మ, యూనియన్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ సుమలత, అంజి, సిహెచ్‌. దుర్గయ్య, వెంకటయ్య, సుధాకర్‌, కుమార్‌, చంద్రలీల, కిష్టయ్య, అంజనీయులు, బుద్ధా, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -