Friday, January 23, 2026
E-PAPER
Homeజాతీయంకర్నాటక గవర్నరూ నిష్క్రమణ బాటే

కర్నాటక గవర్నరూ నిష్క్రమణ బాటే

- Advertisement -

చివరి రెండు వాక్యాలతో ప్రసంగం ముగింపు
ఆ తర్వాత సభ నుంచి వాకౌట్‌
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం :సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు : ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై వివక్ష పూరిత ధోరణి కొనసాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్లు ద్వారా తన పెత్తనం చలాయించాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలపై పల్లెత్తు మాట కూడా రానివ్వకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. శాసనసభల్లో తాను చేయాల్సిన ప్రసంగం పాఠాలను సైతం విస్మరించి ఏకంగా సభా నిష్క్రమణలకు పాల్పడుతున్నారు. కేరళ, తమిళనాడు గవర్నర్లు రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, ఆర్‌ఎన్‌ రవి ఆ రాష్ట్ర మంత్రవర్గాలు ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని మార్చి చదవడం, లేక చదవుకుండా మధ్యలోనే వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కోవలోకే కర్నాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ కూడా చేరారు. గురువారం కర్ణాటక కేబినెట్‌ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్‌ ముగింపులోని రెండు వాక్యాలే చదివి శాసన సభను వాకౌట్‌ చేశారు.

శాసనసభలో జరిగిన ఈ కీలక పరిణామంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. గవర్నర్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ నెల 22 నుంచి 31 వరకు కర్నాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల తొలిరోజు గురువారం అసెంబ్లీలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగలోని 11 పేరాలపై గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో ప్రధానంగా వీబీజీ ఆర్‌ఎఎంజీని వెనక్కి తీసుకొని మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)ని పునరుద్ధరించాల్సిందేనన్న డిమాండ్‌ కూడా ఉంది. ఈ విషయాన్ని చదివాల్సివస్తుందనే గవర్నరు గెహ్లాట్‌ సభ నుంచి నిష్క్రమించినట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం గవర్నర్‌ థావర్‌చంద్‌ పోడియం వద్దకు చేరుకుని సాంప్రదాయంగా క్యాబినెట్‌ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని చదవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన తన ప్రసంగంలోని చివరి రెండు లైన్లను మాత్రమే చదివారు. ‘రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక పురోగతి వేగాన్ని రెట్టింపు చేయడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జై హింద్‌, జై కర్నాటక’ అని సభ నుంచి నిష్క్రమించారు. గవర్నర్‌ అసెంబ్లీని వాకౌట్‌ చేయడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి కీలుబొమ్మగా వ్యవహరించారన్నారు.

తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ చేత ప్రసంగాన్ని చదివించింది ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. 22 ఏండ్ల క్రితం మన్మోV్‌ా సింగ్‌ ప్రభుతం ఉపాధి హక్కు, ఆహార హక్కు, విద్య హక్కు, సమాచార హక్కు చట్టాలను తీసుకువచ్చి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలను అమలు చేసింది. 2005 నాటి ఎన్‌ఆర్‌ఈజీఏ పథకం దళితులకు, 50 శాతం మహిళలకు, ఇతర అణగారిన వర్గాలకు వారి గ్రామాల్లో, వారి సొంత పొలాల్లో కూడా వంద రోజుల ఉపాధి హామీనిస్తుంది. వీబీజీ ఆర్‌ఎఎంజీ చట్టం.. వారు ఎక్కడ పని చేయాలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. పాత చట్టం ప్రకారం.. స్థానిక పంచాయతీలు కార్యాచరణ ప్రణాళికలు తయారుచేసేవి. కొత్త చట్టంలో దీన్ని తొలగించారు. మేము దీన్ని వ్యతిరేకించాము. రాష్ట్ర మంత్రివర్గం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను తిరిగి తీసుకురావాలనే మా డిమాండ్‌ను గవర్నర్‌ ప్రసంగంలో చేర్చింది. కానీ గవర్నర్‌ మంత్రివర్గం తయారుచేసిన ప్రసంగాన్ని చదవలేదు. తాను తయారుచేసుకున్న ఒక్క పేరానే ప్రసంగించారు. ఇలా చదవడం ద్వారా రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించారు. ఇది ఎన్నికైన ప్రతినిధుల సభను అవమానించడమే. గవర్నర్‌ చర్యను మా ప్రభుత్వం, పార్టీ, ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మేము నిరసన చేపడతామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -