Thursday, March 5, 2026
E-PAPER
Homeమానవిప్రసార మాధ్యమాలు సమాజహితమై ఉండాలి

ప్రసార మాధ్యమాలు సమాజహితమై ఉండాలి

- Advertisement -

కె.కామేశ్వరి… ఆకాశవాణి, దూరదర్శన్‌లలో నాటకాలు, రూపకాలు, స్త్రీల కార్యక్రమలు, ఎఫ్‌.ఎం చాట్‌ షోస్‌ రూపొందించి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాను రూపొందించే కళారూపం ఏదైనా సమాజహితం కావాలని కోరుకుంటారు. అలాగే ఐబీపీఎస్‌ అధికారిక హోదాలో కళా రంగానికి ఎన్నో రకాలుగా సేవలందిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వంశీ జమున విశిష్ట మహిళా పురస్కారం అందుకోబోతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

నేను పుట్టిపెరిగింది హైదరాబాద్‌ సిటీలో. చదువుకుంది అమీర్‌పేట్‌లోని విద్యోదయ హైస్కూల్లో. ఇప్పడు ఇది సెయింట్‌ ఆంటోనీస్‌గా మారింది. తర్వాత ఇంటర్‌ స్టేల్లా గర్ల్స్‌ కాలేజీలో, డిగ్రీ కోటీ ఉమెన్స్‌ కాలేజీలో పూర్తి చేసి సెంట్రల్‌ యూనివర్సిటీలో పీజీ చేశాను. ఇలా నా బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాదులోనే.. అంటే నేను పక్కా లోకల్‌ అన్న మాట.

ఆరోగ్యంగా పెరిగాం
నా చిన్నతనంలో హైదరాబాద్‌ చాలా సింపుల్‌ టౌన్‌లా ఉండేది. ఏ కాలంలో అయినా వాతావరణం సరి సమానంగా ఉండేది. ఎండాకాలం కూడా చాలా ఆహ్లాదంగా ఉండేది. ఇప్పటిలా మండిపోయే ఎండలు లేవు. మే చివర్లు, జూన్‌లో స్కూల్‌ తెరిచేటప్పుడు వర్షాలు, అలాగే స్కూల్‌ డ్రెస్‌, షూస్‌ కోసం అబిడ్స్‌లో షాపింగ్‌, వేసవి సెలవల్లో బాలానందం లేదా జవహర్‌ బాలభవన్‌ లేదా గాంధీ జ్ఞానమందిరానికి వెళ్లేవాళ్లం. ఇంకా వైఎంసీఏతో పాటు మా కాలనీ చుట్టుపక్కల వాసులతో ఆడుకుంటూ, కొత్త ఆటలు నేర్చుకుంటూ ఎంతో ఆరోగ్యకరంగా పెరిగాం.

నుమాయిష్‌ ఒక్కటే…
రిక్షా, ఆటో, ఆర్‌టీసీ బస్సులు, డబుల్‌ డెక్కర్‌ బస్సులు, కొన్ని టాక్సీలు మటుకే అప్పటి వాహన వ్యవస్థ. లాండ్‌ లైన్‌ ఫోన్లు కూడా అరుదుగా ఉండేవి. అవి కూడా అప్లై చేసి పరపతితో తెచ్చుకుంటేనే వచ్చేవి. ఒక వంద ఇళ్లకు పది ఇళ్లలో మటుకే ఉండేది. ఇప్పటి లాగా మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ అప్పట్లో లేవు. సో.. నాంపల్లి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ మా చిన్నతనంలో పెద్ద ఈవెంట్‌. మేము అప్పట్లో అబిడ్స్‌కి దగ్గరలో ఉండేవాళ్ళం. మా బంధువులు దూర ప్రాంతం నుండి వచ్చే వాళ్ళు మా ఇంటికి. అందరం నడుచుకుంటూ సరదాగా ఎగ్జిబిషన్‌కి వెళ్ళేవాళ్లం. నాంపల్లి రైల్వే స్టేషన్‌ కూడా దగ్గర కావటంతో వేరే ఊర్ల నుంచి వచ్చేవారు కూడా మా ఇంట బస చేసేవారు.

సాహిత్య చర్చలతో…
మా అమ్మ మొదలి వర్ధని, నాన్న అరుణాచలం. నాన్న ఆకాశవాణిలో హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా పనిచేసి, ముందు ఉద్యోగం తర్వాత జీవితం నుండి రిటైర్‌ అయ్యారు. నాన్న కథలు రాసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా ఎంతో మంది కవులు, గాయకులు, కథా రచయితలు మా ఇంటికి వస్తుండేవారు. వారి చర్చలు వింటూ సాహిత్యం మీద ఆసక్తి పెంచుకున్నాను. నా పీజీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం అనేక సంస్థలకు అప్లరు చేశా. అప్పట్లో ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ పేపర్‌ వచ్చేది. 1988-90లో ఇంకా కంప్యూటర్‌ వ్యాప్తి కాలేదు. కాబట్టి ఉద్యోగాలంటే స్టేట్‌, సెంట్రల్‌, సివిల్స్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ లేదా టీచింగ్‌ మాత్రమే. అలా ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్స్‌ చూసి దరఖాస్తు చేసి రాసిన పరీక్షలో ఒకటి రెండు పాస్‌ అయితే అందులో ఒకటి ఆకాశవాణి కోసం రాసిన రాత పరీక్ష. ట్రాన్స్మిషన్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఉద్యోగం.

ఆకాశవాణిలో ఉద్యోగం…
రేడియోలో ఉద్యోగం అంటే ఓ ప్రత్యేకత. ఎందుకంటే మిగతా ఉద్యోగాలు, మనసుపెట్టకున్నా యాంత్రికంగా అలవాటు చేసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. కానీ సంస్కార బలం పెంపొందించి మనలో సాహిత్య, సాంస్కృతిక మానసిక చైతన్యాన్ని నింపి, తత్వం బోధించి ప్రభావితం చేసే సంస్థ ఆకాశవాణి. దానికి తోడు మాకు ఉండే కోడ్‌ కూడా మమ్మల్ని ఆలోచింప చేస్తుంది. ఇప్పటి సోషల్‌ మీడియా మాధ్యమాలు చెప్పేవి, చూపించేవి చేయలేము. కంట్రోల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ అంటారు కానీ, సమాజానికి ఎంతవరకు మంచిదో అంత మాత్రమే ఇచ్చి ప్రజలకు సమాచారం ఇచ్చి ఆలోచింపచేసేవి. అందుకే ఈ జనరేషన్‌ ప్రభుత్వ ప్రసార మాధ్యమాలను పట్టించుకోవట్లేదు. కానీ ఇతర మాధ్యమాల్లో సమాజ హితం కొరవడుతుంది.

చాలా నేర్చుకున్నా
ఏ వార్త నిజం, ఏది ఆచరణ యోగ్యమో తెలియని అయోమయ స్థితికి నేడు యూట్యూబ్‌ కంటెట్‌ నెట్టేస్తుంది. అన్ని వయసుల వారినుద్దేశిస్తూ, మానవతా పరిరక్షణ పరిమితులతో వ్యవహరించే మాధ్యమాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. స్మాల్‌ ఇన్‌ బ్యూటిఫుల్‌ అంటారు. అమితంగా ఇచ్చే సలహాలు, సూచనలు వెగటుగా ఉంటాయి. అయోమయానికి గురిచేస్తాయి. ఒక నాటక ప్రక్రియతో మన సందేశాన్ని అర్ధవంతంగా క్లుప్తంగా చూపించవచ్చు, వినిపించవచ్చు. ఇక సమయపాలన, సభా మర్యాద, అన్నివర్గాలకు అనుగుణంగా చెప్పే పద్ధతి ఇవి ఉద్యోగ రీత్యా నాకు అలవడినాయి. ప్రభుత్వ ప్రసార మాధ్యమంలో 36 ఏండ్ల అనుభవం. మీడియా మేనేజ్మెంట్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సబ్జెక్ట్‌ ఫ్యాకల్టీగా చెప్పే అవకాశం నాకు ణతీ. MCRHRDI ట్రైనింగ్‌ సెంటర్‌ ఇచ్చింది. ప్రత్యేకించి రచనలు చేయకున్నా, వృత్తి పరంగా సందేశాత్మక నాటికలు, రూపకాలు రచించాల్సిన అవసరం మా ఉద్యోగం నేర్పింది. ఇక రచన తర్వాత నాటక ఆడిషన్‌ గ్రేడ్‌ బి హై క్వాలిఫై అయ్యాను.

బాధ్యత మరింత పెంచింది
కొంత వరకు భాష మీద పట్టు, స్వరాలు, మాటలు భావోద్వేగాలతో ఉచ్చారణ ఇవన్నీ నేర్పింది రేడియో. వృత్తి రీత్యా పీఠాధిపతులు, మినిస్టర్లు, బ్యూరోక్రట్లు, గొప్ప విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు అనేక రంగాలలోని నిష్ణాతులతో పరిచయం ఏర్పడి అవగాహన పెంపొందించుకునే అవకాశం కూడా దొరికింది. మరి నాకు వచ్చిన గుర్తింపు ప్రసార మాధ్యమాలపై ప్రజలకు ఉన్న నమ్మకం, ఆకాశవాణి ఇచ్చిందని భావిస్తున్నా. ఈ పురస్కారం సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచుతుంది. దూరదర్శన్‌ కార్యక్రమాల రూపకల్పనకు గాను ఒక అవార్డు, అలాగే ఫిలిం ఛాంబర్‌ వారి సత్కారం, శారద, మైత్రి మహిళా మండలి ద్వారా స్త్రీల కార్యక్రమాలు రూపొందించినందుకు సన్మానం.. ఇంకా అనేక చిన్న సంస్థలు చేసిన చిరు సత్కారాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. మనం చేసే పని పరులకు ఉపయోగపడాలి. నా మటుకు మరొకరిని నొప్పించకుండా మనకి కావలసిన వాటిని రాబట్టుకోగలిగాను.

  • అచ్యుతుని రాజ్యశ్రీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -