Friday, January 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిస్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం-2

స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం-2

- Advertisement -

ఇరవయ్యవ శతాబ్దంలో పరిస్థితులు చాలా మారాయి. స్త్రీకి పురుషుడితో సమానమైన ప్రతిపత్తి లభించాలని స్త్రీలే సంఘర్షణ ప్రారంభించారు. ప్రపంచ దేశాలన్నింటిలో స్త్రీల పరిస్థితి ఒకేవిధంగా ఉంది. ప్రపంచపు పనిలో మూడింట రెండు వంతులు పనిచేసి, పదింట ఒక వంతు మాత్రమే సంపాదించుకుని, నూటికి ఒక వంతు ఆస్తి కూడా సమకూర్చుకోలేని అభాగ్యుల మీద, తనలోని అర్ధ జనాభా అయిన స్త్రీల మీద చరిత్రలో మొట్ట మొదటిసారి ప్రపంచపు దృష్టి పడింది. తల్లిగా, భార్యగా స్త్రీ నిర్వహించే పాత్ర అద్వితీయమైంది. ఆమె కాలాన్ని, శక్తిని, ఆలోచనల్ని, అన్నింటినీ ఇంటి పని మింగేస్తుంది. ఆ పని ఎంత విలువైందో అంత విలువ లేనిది కూడా! అంటే- ఆమె ఎంత పని చేసినా ఆమెకు ఒక రూపాయి గానీ, కనీసం గుర్తింపుగానీ దొరకవు. ప్రపంచంలోని ఏ దేశంలో నైనా సరే, ఇంటి పని పూర్తిగా చేసేది మహిళలే ! పైగా, బయటిపని అదనం. అంటే, ఒక రోజులో స్త్రీలు రెండు రోజుల పని చేస్తున్నారన్నమాట! ప్రపంచంలో గల ఆహారంలో సగానికి పైగా పండించేది స్త్రీలే. కానీ, వారిదంటూ వారికేమీ భూమి ఉండదు. ఉన్నా ప్రభుత్వ సహాయం గానీ, రుణాలు గానీ అందవు.

ప్రపంచ కూలీలలో మూడు వంతులు స్త్రీలే. అతి తక్కువ కూలీ రేటుకి వీరితో పనులు చేయించుకుంటున్నారు. చేసేపని ఒకటే అయినా, పురుషుడికంటే స్త్రీకి తక్కువ కూలీ చెల్లించేవారు. ఇంటి పనుల్లాగా వారు చేసే వ్యవసాయ పనులకు, కట్టడాల నిర్మాణ పనులకు కూడా సరైన విలువలేదు. ఉద్యోగస్తుల్లో కూడా ఈ తేడా ఉండేది. చేస్తున్న ఉద్యోగం ఒకటే అయినా, కొన్ని దేశాలలో స్త్రీల వేతనం పురుషుల వేతనం కంటే తక్కువగా ఉండేది. 1975-80 ప్రాంతాల్లో ఈ తేడా సవరించబడింది. తెలివైన చురుకైన స్త్రీలు సెక్రటరీలుగా, క్లర్కులుగా, పి.ఎలుగా పనిచేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాల్లో పురుషులు కూడా పనిచేస్తున్నారు కానీ, వారి సంఖ్య తక్కువ. పురుషులు ఎక్కువగా మేనేజర్లుగా, నిర్వహణాధికారులుగా ఉన్నారు. మన దేశంలోనే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, నార్వే వంటి దేశాలలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.

ఇరవై ఒకటవ శతాబ్దంలో మహానగరాల్లో, విద్యావంతుల సమూహాల్లో అవగాహన పెరిగిన కుటుంబాలలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. పురుషులతో పాటు స్త్రీలు కూడా సంపాదన కోసం పరుగులు తీయాల్సివస్తూ ఉంది గనుక, పురుషులు ఇంటి పనిలో పిల్లల సంరక్షణలో భాగస్వాములవుతున్నారు. అట్టడుగు వర్గాలలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఎటొచ్చీ విద్యా విహీనులైన కొంతమంది మధ్య తరగతి పట్టణ-గ్రామీణ ఛాందస కుటుంబాలలో పెద్దగా మార్పు లేదు. మార్పు రావాల్సిన అవసరం చాలా ఉంది. ఇకపోతే నగరాల్లో మరొక దుర్మార్గం జరుగుతూ ఉంది. స్త్రీ-పురుష స్వేచ్ఛ కట్టలు తెంచుకుంటూ ఉంది. జీవశాస్త్ర సంబంధమైన అంశాలు, ప్రకృతికి సంబంధించిన విషయాలు, చారిత్రక సామాజిక విషయాలు పూర్తిగా అవగాహన చేసుకోకుండానే రచనలు చేసిన కొంతమంది స్త్రీవాద రచయిత్రుల మనోభావాల్ని సానుభూతితో అర్థం చేసుకుంటూ, వారి ఆలోచనల్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

శతాబ్దాలుగా ఈ సమాజం మనువాద సంస్కృతికి బానిసైపోయిన విషయం గ్రహించాలి. దాన్ని ఖండించాలి. నిరసించాలి. కూకటి వేళ్లతో దాన్ని పెకిలించి నాశనం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. సమకాలీనంలో కనిపించే పురుషాహంకారాన్ని, కొన్ని అవకతవకల్ని దుయ్యబడితే సరిపోదు. శతాబ్దాలుగా సమాజంలో సాగుతున్న పురుషాధిపత్యాన్ని ముందు తగ్గిస్తూ, స్త్రీ పురుషులిద్దరూ సమానమేనన్న భావనని పెంపొందించాలి కదా? అధికారికంగా, అనధికారికంగా పురుషుడు ఎంతోమంది స్త్రీలతో సంబంధం పెట్టుకోగల సౌలభ్యం మనువాదం ఇచ్చింది. ముందు దానిపై దృష్టిపెట్టాలి కదా? ఆధునిక, ప్రగతి శీల, ప్రజాస్వామ్య, వైజ్ఞానిక ఆలోచనా ధోరణిలోకి సమాజాన్ని లాక్కుని రావాల్సిన బాధ్యత అందరిది! చెట్టు వేళ్లను పట్టించుకోకుండా పైన కనిపించే కొమ్మల్ని కొట్టేస్తూ ఉంటే లాభం ఉండదు. మనువాద భావజాలపు విషవృక్షపు వేళ్లలోంచి మళ్లీ మళ్లీ మొలకలు లేస్తూనే ఉంటాయి.లోతుల్లోకి వెళ్లి విషయాన్ని అవలోకించకుండా అవగాహనా రాహిత్యంతో ఊరికే పురుష ద్వేషాన్ని వెళ్లగక్కితే లాభమేమిటీ? ఒక్కసారి ఆలోచించి చూడండి!

పొద్దున లేస్తే మీ ఇళ్లలో మోగే సుప్రభాతాలలో స్త్రీ అంగాంగ వర్ణనలు ఎన్ని ఉన్నాయో గమనించారా? ముందు వాటిని నిరసించాలి కదా? సంప్రదాయ రచనల పేరుతో, భక్తి కీర్తనల పేరుతో మహామహా గాయకులు, గాయనీమణులు పాడే పాటలకు పరవశులై పోయే ముందు ఒక్కసారి వాటికి ఉన్న అర్థాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గాయనీ గాయకుల ప్రతిభని నేను ప్రశంసిస్తాను. కానీ, వారు శాస్త్రీయ సంగీతం పేరుతో వళ్లు మరిచి, శ్రోతల్ని మైమరపిస్తూ ప్రచారం చేస్తున్నదేమిటి? అహేతుకమైన, అశాస్త్రీయ భావాలు కావా? సామాన్యుడి జీవన పోరాటాల్ని మరి ఎప్పుడూ ఆ స్థాయిలో పాడలేకపోయామేనన్న విచారం వీళ్లలో లేనేలేదు కదా? మనువాదానికి బానిసలైపోయి, కళ్లు మూసుకుపోయి తమ అహంకార భావనతో గతంలో రాజ్యపాలకులు కట్టించిన ఆలయాల శిల్పాలు చూడండి.

వాటిపై స్త్రీ, పురుష నగ్న‌ శిల్పాలూ, లైంగిక భంగిమలూ అవసరమా? నాగరికమైన హుందాతనమేదీ? ప్రపంచ దేశాలలో ఎక్కడా ఇలాంటి శిల్పాలెందుకు లేవూ? బ్రాహ్మణవాదం – మనువాదం ఈ దేశాన్ని ఇంతగా నాశనం చేస్తూ వచ్చాయి కాబట్టి, ఈ అనాగరిక దరిద్రమంతా ఇక్కడే ఉంది. స్త్రీ అంగడి సరుకు అని చెప్పి అన్ని ప్రక్రియల్లో, అన్ని రూపాల్లో ప్రచారం చేసిన ఘనత కేవలం ఈ దేశంలోని మనువాదానిదే! అభ్యుదయ కాముకులు, ముఖ్యంగా భారతీయ ఫెమినిస్టు ఇలాంటి విషయాల్ని ఎందుకు వదిలేశారూ? ఇక ఇప్పుడైనా కాస్త కళ్లు తెరుచుకుని, వారు వామపక్ష, వైజ్ఞానిక సంఘాలతో కలిసి పరిస్థితుల్ని మెరుగుపరచడానికి ఉద్యమించాలి. వ్యక్తులైనా, సంఘాలైనా పొరపాట్లు చేయడం సహజం. కాలక్రమంలో అనాలోచితంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ, జరిగిన తప్పిదాల్ని సమీక్షంచుకుని వెంట వెంట సరిదిద్దుకోకపోతే, తప్పు ఎవరిదవుతుందీ?

సరే, ఒకసారి మళ్లీ సమకాలిన పరిస్థితుల్లోకి వస్తే స్త్రీ చైతన్యాన్ని ఎలుగెత్తి చెప్పడం మంచిదే. కాని, పురుషుల ఆలోచనా విధానంలో రావల్సిన మార్పు గురించి కూడా ఫెమినిస్టులు రచనలు చేయాలి. అంతేగాని కొన్ని తరాల కింద ఎవరో తమ స్త్రీ జాతిని అన్నాయం చేశారని, దోపిడీ చేశారని ఈ తరం మీద కక్ష సాధించాలనుకోవడం ఏం సబబు? స్త్రీ పురుషులిద్దరూ సంయమనం పాటించడం అవసరం. చరిత్రను అర్థం చేసుకుని విజ్ఞాలుగా ఎదగడం అవసరం. తరాలు మారాయి. పరిస్థితులు మారాయి. అవలోకనమూ మారాలి! భావోద్వేగాల్ని కాదనలేం కాని, వాటిని అదుపులో పెట్టుకుని, వాస్తవాల్ని దర్శించడం కూడా అవసరం. అయితే ఏదిఏమైనా, తప్పకుండా ఈ రోజుల్లో కూడా స్త్రీ అనేక రకాల దోపిడులకు గురవుతూనే ఉంది. ప్రేమ వైఫల్యాలు కావొచ్చు. శాడిస్టుల దురాగతాలు కావచ్చు. వరకట్నపు చావులు కావచ్చు. విదేశీ వివాహ మరణాలు కావొచ్చు. ఏది చూసినా, ఎక్కువ శాతం వివక్షతకు గురవుతున్నది మహిళలేనన్నది వాస్తవం.

ఇక ఇప్పుడు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. స్త్రీకి పురుషుడితో సమానమైన ప్రతిపత్తి లభిస్తోంది. మన పార్లమెంట్‌ ఈ రోజు కాకపోతే రేపు మహిళా బిల్లు ప్రవేశపెట్టక తప్పదు. దేశంలో అధ్యక్ష పదవిలో మహిళల్ని నియమించుకుని గౌరవించు కుంటున్నాం. దేశంలో పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షరాలు మహిళే. ఆరుదశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తూవచ్చిన పార్టీకి అధిపతుల్లో మహిళలు కూడా ఉన్నారు. అక్కడ అమెరికాలో అధ్యక్ష పదవికి మహిళ కూడా పోటీ పడింది. పోలీసు, మిలట్రీ శాఖలలో కూడా మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి) రంగం విజృంభించినప్పటి నుండి పురుషులతో సమానంగా స్త్రీలు కార్పోరేట్‌ స్థాయిలో తమ ఆధిపత్యం నిలుపుకుంటున్నారు. అన్నీ నిజమే కానీ, మార్పులన్నీ విద్యావంతుల సమూహాల్లోనూ, మహానగరాల్లోనూ, నాగరిక సమాజంలోనూ కనిపిస్తున్నాయి. ఇలాంటి మార్పు పట్టణ, గ్రామీణ సమూహాల్లో కూడా రావల్సిన అవసరం ఉంది. స్త్రీని కించపరిచే చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది.

మనుస్మృతిలో స్త్రీలకు పురుషులతో సమానమైన స్థాయి లేదు. విద్య లేదు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మహిళలంతా శూద్రులే- భర్త చనిపోతే, ఏ వయసు ఆడ పిల్లయినా సతీ సహగమనం చేయాల్సివచ్చేది. భారత ప్రధాని మోడీజీ ఇటీవల గొప్పగా చెప్పిన భారతీయ మూలాలలో ఇది ముఖ్యమైంది! వీటిని మళ్లీ పునరుద్ధరించుకోవాలని ఆయన భాషణ్‌లిస్తున్నారు. చదువు లేకపోయినా ఫరవాలేదు, మనిషిగా పుట్టినందుకు ఇంగిత జ్ఞానమైనా ఉండాలి కదా ? అక్రమాలు, దౌర్జన్యాలు, ఓట్‌చోరీలు చేస్తూ దొంగదారిన అధికారం చేజిక్కించుకున్న వారి మాటలు ఇలాగే ఉంటాయి. వివేకంగా ఎలా ఉంటాయి? ఒక రకంగా ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఎలా ఉందంటే- మిత్రో- మనం 2035 నాటికి మళ్లీ మన సంస్కృతి సంప్రదాయాలను వెనక తెచ్చుకుని నిలుపుకుందాం. అందరం కలిసికట్టుగా నూతిలో కప్పల్లా అయిపోదాం. రండి! రండి!! అని పిలుపునిచ్చినట్లుగా ఉంది.

సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -