Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవికటించిన 'వెలిచాల' ప్రయోగం

వికటించిన ‘వెలిచాల’ ప్రయోగం

- Advertisement -

కరీంనగర్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో నిరాశ
పార్టీ నేతల సహకారం లేకున్నా ‘నిర్మల భరోసా’తో ఒంటరి పోరు
రెెండు స్థానాలకే గెలుపు పరిమితం
తన ప్యానెల్‌కు మంత్రుల మద్దతుందన్న ప్రకటనలు
అలాంటిదేమీ లేదని డీసీసీ అధ్యక్షుడి ఖండనతో గందరగోళం
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుకు కరీంనగర్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పార్టీలోని కీలక నేతల సహకారం లేకున్నా, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తన సొంత శక్తితో రంగంలోకి దింపిన ‘నిర్మల భరోసా’ ప్యానెల్‌ కేవలం రెండు డైరెక్టర్‌ స్థానాలకే పరిమితమై, మిగిలిన 10 స్థానాల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికల ద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చూపాలని ఆశించిన వెలిచాల ప్రయత్నం.. అంతర్గత వైరుధ్యాలు, జిల్లా నాయకత్వం నిస్సహకారం కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్‌, జిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు వంటి ముఖ్య నాయకులు ఎవరూ జోక్యం చేసుకోలేదు. వెలిచాల రాజేందర్‌రావు ఒంటరిగా ప్రచారం నిర్వహించినప్పటికీ, కీలక నేతలు దూరం పాటించడం, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఏకంగా వెలిచాల ప్యానెల్‌కు పార్టీ మద్దతు లేదంటూ ప్రకటన విడుదల చేసి ఖండించడం, రాజేందర్‌రావు వ్యూహాన్ని మొదటి అడుగులోనే దెబ్బతీశాయని తెలుస్తోంది. వెలిచాల రాజేందర్‌రావు ‘నిర్మల భరోసా’ ప్యానెల్‌కు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులు ఉన్నాయని ప్రకటించి, ఓటర్లలో నమ్మకాన్ని పెంచడానికి ప్రయత్నించారు. అయితే, మరుసటి రోజే డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ‘కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఎలాంటి ప్యానెల్‌నూ ప్రకటించలేదు, మంత్రుల అండాదండ ఉందనే ప్రచారాన్ని నమ్మొద్దు’ అని ఖండించడం కాంగ్రెస్‌ అంతర్గత గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేసింది. పార్లమెంట్‌ ఇన్‌చార్జి, డీసీసీ అధ్యక్షుడి మధ్య ఏర్పడిన ఈ వైరుధ్యం, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ శ్రేణుల్లోనూ, అర్బన్‌ బ్యాంక్‌ ఓటర్లలోనూ తీవ్ర గందరగోళానికి దారితీసింది. కవ్వంపల్లి ప్రకటనతో వెలిచాల ప్యానెల్‌ ‘అనధికారిక’ కాంగ్రెస్‌ ప్యానెల్‌గా మిగిలిపోయింది.

అనుభవం ముందు తలవంచిన కొత్త ప్రయత్నం
ఈ ఎన్నికల్లో వెలిచాల ప్యానెల్‌ ఓటమికి కేవలం అంతర్గత విభేదాలే కాక, ఇతర అంశాలు కూడా దోహదపడ్డాయి. అర్బన్‌ బ్యాంక్‌ ఓటర్లు పాతవారే కావడం, వారి నాడిపై వెలిచాల గ్రూపుకు స్పష్టత లేకపోవడం మైనస్‌ అయింది. ఏండ్లుగా ఈ బ్యాంకు పాలకవర్గంలో తలమునకలైన కర్ర రాజశేఖర్‌ ప్యానెల్‌ (కూటమి) అనుభవం, ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైంది. రాజశేఖర్‌ ప్యానెల్‌ 9 డైరెక్టర్‌ స్థానాలు గెలుచుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం ఓటర్లలో 44.29శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదవడం, పోలైన ఓట్లలో 37.53శాతం వరకు చెల్లనివిగా మారడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. వెలిచాల రాజేందర్‌రావు ప్యానెల్‌లో జనరల్‌ కేటగిరీలో అనురాసు కుమార్‌, ఉయ్యాల ఆనందం మాత్రమే గెలుపొందారు. మెజారిటీకి కనీసం దగ్గరలో కూడా నిలవలేకపోవడంతో, పార్లమెంట్‌ ఇన్‌చార్జి చేసిన ఈ ‘ఏకపక్ష ప్రయోగం’ వికటించిందనే భావన కింది స్థాయి కేడర్‌లోనూ బలపడింది. ఆయన ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే వాదనా వినిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -