Thursday, July 23, 2026
E-PAPER
Homeజాతీయంఅప్పుడు… ఇప్పుడు

అప్పుడు… ఇప్పుడు

- Advertisement -

అధికారం లేనప్పుడు ఓ తీరు…మంత్రులయ్యాక మరో తీరు
​ఇదీ మోడీ క్యాబినె‌ట్‌‌లో మంత్రుల పరిస్థితి
​1997లో నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా
వీధుల్లోకి దిగిన ధర్మేంద్ర ప్రధాన్
ఇప్పుడు కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉంటూ రాజీనామాకు నై

మహిళలపై భారం పడుతుందని నాడు యూపీఏ సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన స్మృతి ఇరానీ.. మంత్రి అయ్యాక గ్యాస్ ధర పెరిగినా నోరుమెదపలేదు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ అప్పట్లో నీట్ లీకేజీపై ఆందోళనకు దిగారు. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయ్యాక ఆయన హయాంలోనే జరిగిన లీకేజీలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూన్నా పట్టించుకోవడం లేదు. ఈ తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోడీ పాలనలో కేంద్ర మంత్రులపై పలు ఆరోపణలు వస్తున్నా.. ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ పైరవీలు చేసుకుంటూ పదవులను చక్కబెట్టుకోవటం సర్వసాధారణమై పోయింది.

​ న్యూఢిల్లీ : నీట్-యూజీ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు తీవ్రమవు తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు దశాబ్దాల క్రితం నాటి ఓ సంఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. 1997లో ఒడిశాలో జరిగిన ఒక పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ ఆందోళన చేపట్టినట్టు, దానికి ఆయన నాయకత్వం వహించారని పేర్కొంటూ, 2021 నాటి ఒక నివేదిక సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీన్ని ప్రస్తుత పరిస్థితికి ముడిపెట్టడంతో పాటు పలు వాదనలూవినిపిస్తున్నాయి. ఇండియా టుడే వివరాల ప్రకారం.. ఈ వాదన కొత్తది కాదు. 2021లో ప్రచురితమైన ఒక ప్రొఫైల్ నివేదిక ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ మాజీ సహచరుడిని ఉటంకిస్తూ, ఆయన 1997లో ఒడిశా సచివాలయం వెలుపల పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రద ర్శనలో పాల్గొన్నారని పేర్కొంది. ఆ నిరసన ప్రదర్శన సమయంలో జరిగిన పోలీసు లాఠీచార్జీలో ఆయన గాయపడ్డారని తెలిపింది.

అసలు 1997లో ఏం జరిగింది?
1997వ సంవత్సరం అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని కొత్త కేంద్ర ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒడిశాలో ఒక ప్రశ్నాపత్రం లీకైంది. ఆ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యదర్శిగా ఉంటూ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సుమారు 1500 మంది విద్యార్థులతో కలిసి అప్పటి ఒడిశా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నిరసన చేపట్టినట్టు చెబుతున్నారు. అప్పటి ఫొటోలు, కథనాలను ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ప్రజలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే అంశంపై పోరాడిన నాయకుడు, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

​ ​ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ..
​ 2021లో విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. పేపర్ లీక్‌ల నుంచి పరీక్షల ఏర్పాట్ల వరకు అనేక అంశాలపై ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంది. నివేదికల ప్రకారం, గత ఎనిమిదేండ్లలో దేశవ్యాప్తంగా 90కి పైగా పేపర్ లీక్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఇతరులు విద్యాశాఖ మంత్రి నుంచి సమాధానాలు కోరుతూ నిరసన తెలుపుతున్నారు. 2026 నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు, యువత డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎక్కడ తన పదవి ఊడుతుందోనన్న భయంతో ఆయన మోడీకి దగ్గర ఉండే మంత్రులను కలిసి..‘నా తప్పేం లేదు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -