బీజేపీ సభ్యులు రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలపై శాసనసభలో దుమారం
ఆయన క్షమాపణ చెప్పాల్సిందే : అధికార కాంగ్రెస్ పట్టు
ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి : మంత్రి శ్రీధర్‌బాబు
ఉద్దేశపూర్వకంగా అనలేదు…ఇందిరమ్మపై ఎంతో గౌరవం ఉంది : రాకేష్‌రెడ్డి
సభా సాంప్రదాయాలు పాటించాలి : ప్యానెల్ స్పీకర్ బాలూనాయక్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభలో బుధవారం బీజేపీ సభ్యులు రాకేష్‌రెడ్డి ఇప్పసారా ప్రాధాన్యతను తెలియజేస్తున్న క్రమంలో ఇప్పసారాకు ఇందిరాగాంధీ పేరు పెడతారా ఏంటి? అని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు. అందుకు బీజేపీ సభ్యులు బల్లాలు కొడుతూ ఆయనకు మద్దతు పలికారు. రాకేేష్‌రెడ్డి అసందర్భంగా ఇందిరాగాంధీ పేరు ప్రస్తావించడంతోపాటు మత్తు పానీయానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో అధికార కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఇందిరమ్మ క్యాంటీన్లు, ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలకు పేర్లు పెడుతున్న నేపథ్యంతో ఇప్పసారాకు కూడా ఆమె పేరు పెడతారాఅంటూ బీజేపీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు ఇందిరమ్మను అవమానించేలా ఉన్నాయని అధికార కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వేరరెడ్డి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నం చేయగా, స్పీకర్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. రాకేేష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయననే సమాధానం చెప్పాలంటూ ప్యానెల్ స్పీకర్ బాలూనాయక్ సూచించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ దేశం కోసం త్యాగాలు చేసిన ఇందిరాగాంధీనుద్దేశించి ఆయన మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభ నియమ, నియమ నిబంధనలను పాటించడం, పెద్దలను గౌరవించడం సభ్యుల ప్రాథమిక లక్షణమన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సభ నిబంధనలకు వ్యతిరేకమని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ విషయంలో ప్యానెల్ స్పీకర్ రూలింగ్ ఇవ్వాలంటూ కోరారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, వాకిటి శ్రీహరి కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. నిరుపేదల కోసం ఇందిరాగాంధీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలను గుర్తు చేశారు.
మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పారు కూడా ఇందిరాగాంధీని దుర్గాదేవి, ఉక్కుమహిళ అంటూ కొనియాడారని తెలిపారు. అంతేకాకుండా సభలో లేని వ్యక్తి గుర్తించి ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. పొరపాట్లు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం ద్వారా తమ గౌరవం పెరుగుతుందే తప్ప తగ్గదంటూ మంత్రి జూపల్లి తన అనుభావాన్ని గుర్తు చేసుకున్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ వ్యవసాయం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన డిమాండ్లపై చర్చ జరుగుతున్న తరుణంలో గంట సమయం వృధా అయిందన్నారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల తొలగించడమో, లేదా సభ్యుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవటమో చేయాలని సూచించారు. ఇరుపక్షాలు సభను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ఇందిరాగాంధీ అంటే తనకు ఎంతో గౌవరముందని చెప్పారు. ఆమెపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ నాయకులెవరూ ఖండించలేదనీ, తానే తీవ్రంగా ఖండించానని సభకు వివరించారు. సదుద్ద్దేశంతోనే ఆమె పేరు పెట్టొద్గు అని సూచించానే తప్ప అవమానించలేదని స్పష్టం చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చివరగా జోక్యం చేసుకోవడంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ స్థానంలో బాలూనాయక్ రూలింగ్ ఇచ్చారు. అనంతరం డిమాండ్లపై చర్చ కొనసాగింది. బీఆర్‌ఎస్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్లపై చర్చను కొనసాగించారు. బడ్జెట్ అంకెల గారడీ అని విమర్శించారు. పంట నష్టానికి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా బీడు భూములను సస్యశామల చేశారని గుర్తు చేశారు.



