నవతెలంగాణ-హైదరాబాద్ : నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన వీడియోపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అర్ధరాత్రి విడుదల చేసిన ఈ వీడియో విద్యార్థుల మేధస్సును అవమానపరిచేలా ఉందని ఆయన విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా రాహుల్ గాంధీ స్పందించారు. “ప్రధాని విడుదల చేసిన అర్ధరాత్రి వీడియో అత్యంత దయనీయంగా ఉంది. ఇది విద్యార్థులను అవమానించడమే” అని ఆయన పేర్కొన్నారు. నీట్ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన కొద్దిసేపటికే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నీట్-యూజీ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం విదితమే.



