– ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలోని ప్రీ – ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సోమవారం లోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు ఎంఈఓ ప్రసాదరావు ఆదివారం సూచించారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత విద్యార్హతగా ఉండగా, ఆయా పోస్టుకు కనీసం 7 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విద్యా సంవత్సరంలో మండలంలోని 13 పాఠశాలలకు కొత్తగా ప్రీ – ప్రైమరీ తరగతులు మంజూరు కాగా,గత ఏడాది మంజూరైన ఒక పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్ పోస్టు ఇప్పటికీ ఖాళీగా ఉంది.
దీంతో మొత్తం 14 పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, 13 పాఠశాలల్లో ఆయా పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి సంవత్సరంలో 10 నెలలపాటు మాత్రమే వేతనం చెల్లిస్తారు. ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.8 వేలు, ఆయాలకు నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం అందజేయబడుతుంది. నియామకాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముందుగా సంబంధిత హ్యాబిటేషన్‌లో నివసించే అభ్యర్థులను, ఆ తర్వాత గ్రామపంచాయతీ పరిధిలోని వారిని, అనంతరం మండలంలోని ఇతర అర్హులైన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంఈఓ ప్రసాదరావు కోరారు.



