బలవంతంగా అయినా గ్రీన్‌లాండ్ ఆక్రమణ, వ్యతిరేకించే ఐరోపా దేశాలపై ఐదు వందల శాతం పన్ను విధిస్తానంటూ చిందులు వేసిన డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కు తగ్గాడు. గ్రీన్‌లాండ్ విభజనకు బలవంతంగా ఐరోపా దేశాలను ఒప్పించిన తరువాతే ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. అయితే ట్రంప్ షరతులను పూర్తిగా ఆమోదిస్తాయా అన్నది ప్రశ్న. దవోస్‌లో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూటెతో చర్చలు జరిపిన తరువాత ట్రంప్ స్వరం మార్చాడు. బుధవారం నాడు దవోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో మాట్లాడుతూ ప్రస్తుతానికి అపరాధ పన్నుల విధింపు అజెండా లేదని, ఒక్క గ్రీన్‌లాండ్ మీదనే గాక మొత్తం ఆర్కిటిక్ ప్రాంతం మీద ఒక ఒప్పందం కుదుర్చుకుంటామని, దాని గురించి ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియో చర్చలు కొనసాగిస్తారని అన్నాడు. తాను సూచించిన పరిష్కారం కుదిరితే అది ఒక్క అమెరికాకు మాత్రమే గాక అన్ని నాటో దేశాలకు ప్రయోజనం కలిగిస్తుందని తన సామాజిక వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించాడు.
దాన్లో గ్రీన్‌లాండ్‌కు కూడా తమ దేశం మాదిరి రక్షణకు ”బంగారు గుమ్మటాన్ని” (క్షిపణి రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాడు. తన అవగాహన కాస్త సంక్లిష్టమే అయినప్పటికీ యూరోపియన్లకు వివరిస్తామని, ఒప్పందం కుదిరితే గ్రీన్‌లాండ్‌లోని వనరుల మీద ఉభయులకు హక్కులు లభిస్తాయని, కొత్త ఏర్పాటు శాశ్వతంగా ఉంటుందని చెప్పాడు.అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం గ్రీన్‌లాండ్‌లో కొంత ప్రాంతాన్ని అమెరికా సార్వభౌమత్వం కింద ఉంటుంది. అక్కడ మిలిటరీ కేంద్రాల నిర్మాణం చేస్తారు. ట్రంప్ ప్రకటన తరువాత డెన్మార్క్ స్పందనను గమనిస్తే మెత్తబడి ఒప్పందానికి సానుకూలంగా ఉన్నట్లు అనిపిస్తున్నది. తెగేదాకా లాగితే ఉభయులకూ నష్టమని ఐరోపా యూనియన్- అమెరికా రెండూ పునరాలోచనలో పడిన కారణంగానే ఈ పరిణామం సంభవించిందా?లేక అమెరికాతో పెట్టుకుంటే తాము నెగ్గలేమని ఐరోపా లొంగిపోయినట్లా?
కొంతమంది మామూలుగా చెబితే వినరు,వారికి నిరంకుశులే సరైనవారు అంటూ దవోస్‌లో వాణిజ్యవేత్తలతో ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. మనం మంచిగా మాట్లాడితే మంచి సమీక్షలు వస్తాయి, నేను వాటిని నమ్మను, తనను భయంకర నిరంకుశుడని అంటారని, నిజానికి తాను అలాంటి వాడినే అని, అయితే గ్రీన్‌లాండ్ విషయంలో కాదు అంటూ సగం జోక్, సగం బెదిరింపు ధోరణిలో ట్రంప్ వ్యవహరించాడు. ఒక్కరోజైనా నియంతగా ఉండాలని ఉందని గతంలో ఒకసారి ట్రంప్ జోకులు వేస్తూ మాట్లాడినప్పటికీ ఆచరణలో నిజంగానే నిరంకుశుడిగా వ్యవహరించటం తెలిసిందే. ఏడాది పాలనా కాలంలో కరీబియన్ సముద్ర ప్రాంతంలో పడవలపై దాడులు చేసేందుకు పార్లమెంటును సంప్రదించలేదు. కెనడా తమ దేశంలో 51వ రాష్ట్రంగా ఉండాలన్నాడు. గ్రీన్‌లాండ్ గురించి వేరే చెప్పనవసరం లేదు.మదురో కిడ్నాప్, ఇరాన్‌పై చర్యల ప్రకటన కూడా స్వంత నిర్ణయమే.నిరసనలను అణచే పేరుతో అమెరికాలోని అనేక పట్టణాలకు మిలిటరీని పంపటం కూడా దానిలో భాగమే. వివిధ దేశాల సరకులపై పన్నులు విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే.నవంబరులో జరగాల్సిన మధ్యంతర ఎన్నికలు కూడా అవసరం లేదని రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పాడు.
దవోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రసంగంలో అలవోకగా ట్రంప్ పచ్చి అబద్దాలు చెప్పాడు. హరిత ఇంథనం గురించి చెప్పే చైనాలో అసలు గాలిమరలు లేవన్నది వాటిలో ఒకటి. నూటికి నూరుశాతం నాటో ఖర్చును తామే భరిస్తున్నామని, తమకు దక్కిందేమీ లేదన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై దురాక్రమణ దాడికి దిగినపుడు నాటో దేశాలు తమ మిలిటరీతో పాటు ఆయుధాలు, సామగ్రిని కూడా పంపాయి. నాటో దేశాలు విధిగా పాల్గొనాల్సిందే అని ఆర్టికల్ ఐదును అమెరికా అమల్లోకి తెచ్చింది. నిజానికి ఖర్చులో నాటో దేశాలు 70శాతం భరిస్తున్నట్లు బిబిసి తెలిపింది. తన ఏడాది పాలనలో 18లక్షల కోట్ల డాలర్ల మేర పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పాడు.అధికారిక వెబ్‌సైట్‌లో నవంబరు నాటికి 9.6లక్షల కోట్ల డాలర్ల సమాచారమే ఉంది.
నార్త్ సీ ప్రాంతంలో చమురు కంపెనీల రాబడి నుంచి 92శాతం మొత్తాన్ని బ్రిటన్ తీసుకుంటున్నకారణంగా చమురు కంపెనీలు అక్కడికి వెళ్లలేకపోతున్నాయని చెప్పింది కూడా అవాస్తవమే అని తేలింది. ‘ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువకు’ మారుపేరుగా తమ అధ్యక్షుడి తీరు ఉందని అమెరికన్లు జోకులు వేస్తున్నారు.దానికి పెట్టిన పేరు ”టాకో ట్రంప్” ఐరోపాపై పన్నుల విధింపు నిలిపివేసినట్లు ట్రంప్ చేసిన ప్రకటనను అమెరికన్లు అపహాస్యం చేస్తున్నారు. విముక్తి దినం పేరు ప్రపంచం మీద విధించిన పన్ను ప్రకటనలను వెనక్కు తీసుకున్నప్పటి నుంచి నెటిజన్లు ట్రంప్‌ను ఆడుకుంటున్నారు. వెనక్కు తగ్గినట్లు దవోస్‌లో ప్రకటించినప్పటికీ తన షరతుల ప్రకారం ఐరోపా అంగీకారం తెలుపకపోతే గ్రీన్‌లాండ్‌పై అమెరికా కత్తి వేటు ఎప్పుడైనా పడవచ్చు!
పంతం వీడని ట్రంప్ – గ్రీన్‌లాండ్ విభజన!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



